నెలకు అద్దె రూ.2కోట్లు.. లీజుకు తీసుకున్నదెవరంటే?

దేశీయంగా వ్యాపార దిగ్గజాలు చాలామందే ఉండొచ్చు. ఇటీవల కాలంలో ఎవరికి రానంత పేరు వచ్చింది సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా. కరోనా ముందు వరకు కొందరికి మాత్రమే పరిచయమైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ (కోవీ షీల్డ్) తయారీ నేపథ్యంలో ఆయన పేరు సామాన్యుడికి సైతం సుపరిచితమైంది. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇందుకు కారణం ఆయన ఇంటి అద్దె కోసం పెడుతున్న భారీ మొత్తమే. సాధారణం ఒక సామాన్యుడి జీవితంలో కోటి రూపాయిల ఆదాయం అన్నది కలే. కోటి సంపాదించి పెడితే.. తన జీవితానికి ఒక సార్థకత వచ్చినట్లే అన్న భావన వ్యక్తమవుతూ ఉంటుంది.

అలాంటి కోటి మొత్తాన్ని కేవలం రెండు వారాల ఇంటి అద్దె కోసం ఖర్చు చేయటం మాటలా? అది కూడా తన విదేశీ ప్రయాణాల సమయంలో ఉండేందుకు కావటం మరో విశేషం. లండన్ లోని అత్యంత ఖరీదైన మేఫెయిర్ లోని ఒక విలాసవంతమైన భవనాన్ని ఆయన ఇటీవల లీజుకు తీసుకున్నాడు. దానికి వారానికి అద్దె కేవలం రూ.50లక్షలు మాత్రమే. అంటే నెలకు రూ.2 కోట్లు అన్న మాట. దీనికి సంబంధించి ప్రముఖ బిలియనీర్ డొమినికా కల్క్ జిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

నెలకు రూ.2కోట్ల మొత్తాన్ని అద్దెకు ఇచ్చే ఈ ఇల్లు ఎంత ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. ఇందులోనే ఒక గెస్ట్ హౌస్ తో పాటు.. కనువిందు చేసే ఉద్యానవనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. భారీ మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించటం ద్వారా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా మారారు.