దేశంలో రూ.7 కోట్ల కనీస ఆస్తి ఉన్న కుటుంబాలు ఎన్నో తెలుసా?

మినిమం రూ.7కోట్ల సంపద ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. డాలర్ మిలియనీర్ లో భాగంగా ఈ లెక్కింపును చేపట్టారు. హురున్ ఇండియావెల్త్ రిపోర్టు 2020 ప్రకారం.. దేశంలో రూ.7కోట్లు కనీసం ఆసక్తి ఉన్న కుటుంబాలు ఏకంగా 4.12 లక్షలు ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంపన్న కుటుంబాల్లో మహారాష్ట్ర ముందున్నట్లుగా చెబుతున్నారు.

ఆ రాష్ట్రంలో డాలర్ మిలియనీర్ కుటుంబాలు ఏకంగా 56వేలు ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. అందులో 16,933 కుటుంబాలు ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో నివసిస్తున్నట్లుగా తేల్చారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో 16వేల కుటుంబాలు ఉంటే.. కోల్ కతాలో 10వేలకుటుంబాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. బెంగళూరులో 7500 కుటుంబాలు.. చెన్నైలో4700 కుటుంబాలు ఉన్నాయి. టాప్ టెన్ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు లభించింది.

అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న ముంబయి.. దేశ జీడీపీకి 6.16 శాతం.. ఢిల్లీ 4.94 శాతం వాటా అందిస్తున్నాయి. దేశంలో 5.64 శాతం మధ్య తరగతి కుటుంబాలు ఉంటే.. రూ.7 కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి.. ఏటా 2.5 లక్షలకుపైగ ఆదాయం ఆర్జిస్తున్న వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. అంతేకాదు.. దేశంలో సరికొత్త మధ్యతరగతిని కూడా హురున్ గుర్తించింది. ఏటా సగటున రూ.20లక్షలు పొదుపు చేస్తున్న కుటుంబాలు 6.33లక్షలు ఉన్నట్లుగా తేల్చింది. ఈ లెక్కలన్నింటిని ఒకవైపు.. వాస్తవ కోణంలో చూస్తే.. హురూన్ పేర్కొన్న కుటుంబాల కంటే ఎక్కువగా.. దేశంలో సంపన్నులు ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.