ఈ తరానికి ఏమైంది? నచ్చింది దక్కకపోతే చంపేయటమేనా? బంధాలకు.. అనుబంధాలకు తెగుళ్లు తెస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. ఈ తరమే కాదు పాత తరం కూడా హత్యా బాటను పట్టటం ఆందోళనకు కలిగించేదే. క్షణికావేశంలో కట్టుకొని.. 45 ఏళ్లు కాపురం చేసిన భార్యను దారుణంగా హతమార్చిన 65 ఏళ్ల సుబ్రమణ్యేశ్వరరావు తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆందోళనకు గురి చేస్తున్న ఈ వైనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని రంగంబంజర గ్రామంలో చోటు చేసుకుంది.
సుబ్రమణ్యేశ్వరరావుకు విజయలక్ష్మితో 45 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిది క్రిష్ణా జిల్లా అయినప్పటికీ 30 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు వచ్చి స్థిరపడిపోయారు. పెద్ద కుమార్తె రామగుండంలో ఉంటే.. చిన్న కుమార్తె అమెరికాలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తున్నారు. అమెరికాలో ఉన్న చిన్నకుమార్తె వద్దకు వెళ్లేందుకు విజయలక్ష్మీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న కానీ 21న కానీ ఆమె అమెరికాకు వెళ్లాల్సి ఉంది. వీసా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది.
ఈ దశలో అమెరికాకు వెళ్లే విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అమెరికాకు వెళ్లేందుకు భర్త సముఖంగా లేకపోవటం.. ఇప్పుడు వద్దన్నప్పటికి భార్య మాత్రం వెళతానన్నారు. దీంతో.. క్షణికావేశంలో కత్తితో మెడపై నరికి హత్య చేశారు. అనంతరం తాను చేసిన పనికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
బుధవారం ఉదయం పాలు పోసేందుకు వీరి ఇంటికి వెళ్లిన వ్యక్తి.. కొనఊపిరితో ఉన్న సుబ్రమణ్యేశ్వరరావును చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 45 ఏళ్లు కాపురం చేసిన భార్యపై కత్తి దూయటం ఇప్పుడు మింగుడుపడని వ్యవహారంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates