ఖమ్మం సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ కోసం కొట్లాట, ఒకరు మృతి

గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు నడి రోడ్డు మీద కోట్లాడుకోవటమే కాదు.. చివరకు విషయం కత్తిపోట్ల వరకు వెళ్లి.. ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇల్లెందు ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే పాతికేళ్ల యువకుడు పనుల కోసం ఖమ్మం పట్టణానికి చేరుకున్నాడు. ఉదయం పనులు.. సాయంత్రం చుక్కేసి ఇంటికి వెళ్లటం అలవాటు. ఈ క్రమంలో ఇటీవల ఒక మహిళ పరిచయమైంది. ఆమె సాన్నిహిత్యం కోసం ప్రయత్నించగా.. ఇవాళ బిజీ మరోసారి కలుద్దామని వెళ్లిపోయింది.

ఆమె మీద ఇష్టం పెంచుకున్న వెంకటేశ్.. ఆమె కోసం అదే సెంటర్లో వెయిట్ చేసేవాడు. తాజాగా ఆమె మరోసారి తారసపడింది. ఈసారి ప్రపోజ్ చేయగా.. ఆమె ఓకే చెప్పింది. ఈ రోజు ఇద్దరం కలిసి ఉందామన్న ప్రపోజల్ కు ఓకే చెప్పటంతో ఫుడ్ పార్సిల్ చేయించసాగాడు. అదే క్రమంలో అక్కడకు వచ్చిన రాపోలు వెంకటేశ్వర్లు.. ఆమెను తనతో రావాలని బలవంతం చేశాడు.

తనతో సహజీవనం చేస్తూ.. మరో వ్యక్తితో ఎలా వెళతావని నిలదీశాడు. దీంతో.. ఆమె కోసం వెంకటేశ్.. వెంకటేశ్వర్లు గొడవ పడ్డారు. అది కాస్తా కోట్లాటకు దారి తీసింది. వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో వెంకటేశ్ పొత్తికడుపులో పొడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడు. ఒక అమ్మాయి కోసం గొడవ పడి.. ఒకరు మరణించిన వైనం సంచలనంగా మారింది. రద్దీగా ఉండే ఖమ్మం సెంటర్లో రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకోవటం గమనార్హం.