నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే అయిదు సంవత్సరాల్లో లేదా అంతకన్నా తక్కువ సమయంలో ఫిలిం మేకింగ్ పరంగా పెను మార్పులు రాబోతున్నాయని, వాటికి సిద్ధంగా ఉండాలని, యువత అప్డేట్ కాకపోతే ఇలాగే ఉంటారని, కానీ ఇండస్ట్రీ పైపైకి వెళ్ళిపోయి గొప్ప స్థాయిని అందుకుంటుందని చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనే వాస్తవాన్ని గుచ్చి చెప్పారు.
కొంచెం భయపెట్టినట్టు చెప్పినా ఆయన అన్న దాంట్లో నిజముంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ నే తీసుకుంటే ఆషామాషీ గ్రాఫిక్స్ తో జనాన్ని మెప్పించే రోజులు పోయాయి. క్వాలిటిలో ఏ మాత్రం తేడా అనిపించినా ఆడియన్స్ సోషల్ మీడియాలో తలంటుతున్నారు. ఈ కారణంగానే విశ్వంభర రెండేళ్లకు పైగా ల్యాబ్ లో ఉంటూ రిపేర్లు చేసుకుంటోంది. మరికొన్ని ప్యాన్ ఇండియా మూవీస్ నెగటివిటీకి భయపడి పదే పదే నాణ్యతని చెక్ చేసుకుంటూ బెస్ట్ అవుట్ ఫుట్స్ కోసం కష్టపడుతున్నాయి.
అరకొర జ్ఞానంతోనే కొందరు నెటిజెన్లు చేస్తున్న వండర్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం. స్పూఫ్స్ మీమ్స్ మాములుగా పేలడం లేదు. ఒకడు ఏకంగా జైలర్ 2 క్లైమాక్స్ మార్చేసి మోహన్ లాల్ ఎక్కువ కనిపించేలా చేయడం చాలా వైరల్ అయ్యింది. ఒకవేళ నిష్ణాతులు కనక ఇలాంటి వాటికి పూనుకుంటే ఆర్టిస్టులు అవసరం లేకుండా కేవలం వాళ్ళ ఫోటోలు వీడియోలతో సినిమాలు తీసే పరిస్థితి రావొచ్చు. జస్ట్ అలా వాడుకున్నందుకు డబ్బులు కడితే చాలనే రోజులు త్వరలో వస్తాయి.
మనం చూస్తున్న ఏఐ ఇంకా ప్రారంభ దశలో ఉంది. 3జి వచ్చినప్పుడు వావ్ ఇంటర్ నెట్ అనుకున్నాం. ఇప్పుడు 5జి కూడా మన వేగానికి సరిపోవడం లేదు. బ్యాండ్ విడ్త్ తక్కువని కంప్లయింట్ చేస్తున్నాం. ఏఐ కూడా అంతే. ప్రస్తుతం కొంచెం ఖరీదుగా అనిపిస్తున్నా ఫ్యూచర్ లో రేట్లు తగ్గిపోయి అందరికి అందుబాటులోకి వస్తే ఇంట్లోనే కూచుని సినిమా తీసేయొచ్చు. బన్నీ వాస్ ప్రిడిక్ట్ చేస్తున్నది ఇలాంటి పరిణామాల గురించే. ఆయన అన్నట్టు ముందుగానే రెడీ కావడం మంచిదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates