ఫౌజీ వచ్చింది… పరిచయం అదిరింది

స్టార్ హీరోల పుట్టినరోజులు హఠాత్తుగా డిసైడ్ కావు. ప్రతి సంవత్సరం అదే రోజు రిపీట్ గా వస్తుంది. వాళ్ళ వయసులు మారతాయి తప్పించి డేట్లు కాదు. అందుకే అభిమానులు ఎంతో ఆతృతగా కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా క్రేజీ కంటెంట్ వస్తుందని వెయిట్ చేస్తారు. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కాబోతున్న ఫౌజీ నుంచి అలాంటిదే ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. నిన్న అర్ధరాత్రితో మొదలైన ఎదురు చూపులు ఇంకో మూడు గంటల్లో బర్త్ డే అయిపోతున్న టైంలో తీరిపోయాయి.

రెండున్నర నిమిషాల వీడియోలో ఫౌజీ క్యారెక్టరైజేషన్ ఏంటో చూపించారు హను రాఘవపూడి. 1942 భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో భాగంగా హిట్లర్ సహాయం అడుగుతాడు సుభాష్ చంద్ర బోస్. అయితే దానికి బదులుగా మీరు బానిసలంటూ హిట్లర్ ఎగతాళి చేస్తాడు. అప్పుడు బోస్ నోటివెంట ఫౌజీ పరిచయం జరుగుతుంది. ఉనికి బయటపెట్టకుండా బ్రిటిష్ ఆర్మీకి చుక్కలు చూపించిన ఒక నిజమైన సైనికుడి అజ్ఞాత యుద్ధం గురించి చెప్పి వెన్నులో వణుకు పుట్టిస్తాడు.

ఎక్కువ విజువల్స్ రివీల్ చేయకపోయినా ఇద్దరు చారిత్రాత్మక వ్యక్తుల మధ్య సంభాషణ దారా హీరోని పరిచయం చేసే ఆలోచన నిజంగా చాలా బాగుంది. తెల్లదొరల పాలనలో ఫౌజీ పేరుతో ఒక సైనికుడు చేసిన గూఢచర్యం ఈ సినిమా పాయింటని అర్థమైపోయింది. కాకపోతే ప్రభాస్ పట్టుకున్న ఆయుధం అప్పటికాలంలో లేదనే సందేహం ఉద్దేశపూర్వకంగా కలిగించినట్టు ఉంది. అసలు మ్యాటర్ చాలా తెలివిగా దాచి పెట్టిన హను నెక్స్ట్ టీజర్ లో అయినా అసలు ప్రపంచాన్ని చూపిస్తారేమో.

దర్శకుడు హను రాఘవపూడికి కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం ఉండదు. క్వాలిటీ కోసం పరితపిస్తూ ఉంటారు. అందుకే షూటింగ్ కూడా బాగా ఆలస్యమవుతూ వచ్చింది. డిసెంబర్ 4 మిస్ చేసుకోవడం ఫ్యాన్స్ కి కొంత నిరాశ కలిగించినా ప్రభాస్ కెరీర్ బెస్ట్ మూవీగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం టీమ్ లో అయితే బలంగా ఉంది. ఫ్రేమ్స్ లో హను పనితనం, విశాల్ చంద్రశేఖర్ నేపధ్య సంగీతం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి ఫౌజీ అభిమానుల ఆకలి తీర్చాడు.