‘కుటుంబం’ జోలికొస్తే ఆయుధమే ‘ఆదర్శం’

మూవీ లవర్స్ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలయిక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేష్ సినిమా. అది ఆదర్శ కుటుంబం ఏకె 47 రూపంలో ఈ నెలాఖరున తీరనుంది. ఇప్పటికే పలు వాయిదాలతో స్వంతంగా ఇబ్బంది పడుతూ ఇతర చిత్రాలను కూడా ట్రబుల్ లో వేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అక్టోబర్ 30 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇవాళ హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. టీమ్ మొత్తం హాజరై సందడి చేసింది.

టీజర్ లో చెప్పిన కథనే ఇందులో ఎక్స్ టెండ్ చేశారు. చిట్టిబాబు (వెంకటేష్) ది మధ్య తరగతి కుటుంబం. ఆదాయం సరిపోక భార్య (శ్రీనిధి శెట్టి) చిట్టి వ్యాపారంలో తెచ్చే నష్టాలను భరించలేక ఇద్దరు పిల్లలతో సతమతవుతూ ఉంటాడు. అదే సమయంలో అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదిస్తాడు. నలభై ఏడు నెంబర్ విల్లా కొంటాడు. నగరంలో దొంగతనాలు దొమ్మీలు చేసే గ్యాంగ్ ఒకటి వీళ్ళ ఫ్యామిలీ వెనుక పడుతుంది. కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి (నారా రోహిత్) ఈ వలయంలోకి వస్తాడు.

మాములుగా త్రివిక్రమ్ ఫాలో అయ్యే కామెడీ టెంప్లేట్ తో పాటు ఈసారి ఫుల్లుగా యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక మాములు కుటుంబం హఠాత్తుగా జరిగిన పరిణామాల వల్ల విలన్ గ్యాంగ్ ని చంపడం కోసం కత్తులు గన్నులు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆ మధ్య అర్జున్ బ్లాస్ట్ జోన్ లో చూశాంగా. కొంచెం పోలిక కనిపిస్తున్నప్పటికీ వెంకీ మార్కు బాడీ లాంగ్వేజ్, మాటల మాంత్రికుడి ట్రీట్ మెంట్ కొత్తగా అనిపిస్తున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే లాక్కొచ్చింది.

క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఒకేసారి టార్గెట్ చేస్తూ ఆదర్శ కుటుంబం ట్రైలర్ కట్ చేశారు. విలన్లను బాగా వయొలెంట్ గా చూపించినట్టు కొన్ని షాట్స్ చూసి చెప్పొచ్చు. తాను రెగ్యులర్ గా వెళ్లే ఫార్మట్ లో ఇది ఉండదని త్రివిక్రమ్ ముందే హింట్ ఇస్తున్నారు కావున ఈసారి ఏదో స్పెషల్ గానే ఆశించవచ్చు. కేవలం వారం రోజులే టైం ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ పరంగా ఆదర్శ కుటుంబం పరుగులు పెట్టాల్సిందే. అందులో భాగంగా వేసిన తొలి అడుగు సక్సెస్ అయినట్టే. జనాల రియాక్షన్లు చూడాలి.