ఇది తీసింది తెలంగాణాలోనే… అమలాపురంలో కాదు

ఇడుపు కాయితం.. ఈ పేరుతో సినిమా అనౌన్స్ చేసిన‌పుడు సోష‌ల్ మీడియాలో ఎంత చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా టీం ఒక స్పెష‌ల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన బ‌న్నీ వాసు ఇడుపు కాయితం షూటింగ్ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన ఆశ్చ‌ర్య‌క‌ర అనుభ‌వాన్ని పంచుకున్నారు.

ఇడుపు కాయితం చిత్రీక‌ర‌ణ‌ను తెలంగాణ‌లోని గుళ్ళ‌ప‌ల్లి అనే ఊరిలో చేయ‌గా.. అక్క‌డికి వెళ్లిన తాను చుట్టూ పచ్చని పొలాల‌తో క‌నిపించిన వాతావ‌ర‌ణాన్ని చూసి షాకైన‌ట్లు బ‌న్నీ వాసు తెలిపాడు. తాను పుట్టి పెరిగింది పాల‌కొల్లులో అని.. ఆ ప్రాంతంతో పాటు అమ‌లాపురంలో ఎలా అయితే అంతా ప‌చ్చ‌గా ఉంటుందో అలాంటి వాతావ‌ర‌ణ‌మే గుళ్ళ‌ప‌ల్లిలోనూ చూసిన‌ట్లు వాసు చెప్పాడు.

తెలంగాణ అంటే ఇక్క‌డ పెద్ద‌గా వ‌రి పండ‌దు, ఇంత ప‌చ్చ‌ద‌నం ఉండ‌దు అనే భావ‌న‌లో ఉండేవాడిన‌ని.. ఇదే విష‌యం గురించి అడిగితే ఈ మ‌ధ్య ఇక్క‌డ నీటి వ‌సతి పెరిగి, వ‌రి బాగా పండుతున్న‌ట్లు చెప్పార‌ని.. ఇది త‌న‌కెంతో ఆనందాన్ని కలిగించింద‌ని, ఇక్క‌డి రైతుల ప‌రిస్థితి మెరుగ‌వ‌డం మంచి విష‌య‌మ‌ని బ‌న్నీ వాసు చెప్పాడు. ఐతే తాము తీస్తున్న‌ది తెలంగాణ ప‌ల్లెటూరి సినిమా కాగా.. ఇందులో చూపించే ప‌చ్చ‌ద‌నం అంతా చూసి ఏపీలోని గోదావ‌రి ప్రాంతం అనుకుంటారేమో అనే భ‌యం ఉంద‌ని బ‌న్నీ వాసు న‌వ్వుతూ చెప్పాడు.

ఇక ఇటీవ‌ల కొన్ని సినిమాల క‌థా నేప‌థ్యాన్ని బ‌ట్టి ఒక ప్రాంతం వారే చూస్తుండ‌డం, అలాగే ఇడుపుకాయితం టైటిల్ మీద జ‌రిగిన చ‌ర్చ‌ గురించి బ‌న్నీ వాసు స్పందిస్తూ.. త‌మ సినిమాలో నటించినోళ్లు తెలుగు వాళ్లే, తీసినోళ్లు తెలుగు వాళ్లే అని.. అయినా కూడా ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా అని మాట్లాడుతున్నారని అన్నాడు. తాము పుట్టినప్పుడు మీరు ఎవరంటే.. తెలుగు వాళ్లం అని చెప్పేవాళ్లమ‌ని.. ప్రాంతాలుగా ఎలా ఉన్నా, ఏం చేసినా కూడా తెలుగు అంద‌రూ ఒక‌టే అని బ‌న్నీ వాసు వ్యాఖ్యానించాడు.