తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు అర్జున ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ఈసారి ఎలాంటి వాయిదాలు ఉండకూడదని, ఇప్పటికే ఒక పెద్ద మూవీ వల్ల రెండు సార్లు డేట్ మార్చుకుందని వెనక్కు తగ్గే ప్రసక్తే ఉండకూడదని చెప్పారు. తీరా చూస్తే మరోసారి పోస్ట్ పోన్ దిశగా అడుగులు వేయడం అసలు ట్రాజెడీ.
టైటిల్ కు తగ్గట్టే ఇట్లు అర్జునకు ఇబ్బందులు వస్తున్నాయి. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో కొడుకు అభిమన్యుడిని పోగొట్టుకున్న అర్జునుడు నరకయాతన చూస్తాడు. ఆ తర్వాత కర్ణుడిని హతమార్చలేక అంతర్మథనం చెందుతుంటే కృష్ణుడు గీత బోధ చేస్తే తప్ప కర్తవ్యం తెలుసుకోలేకపోతాడు. అదే విధంగా బ్రహ్మాస్త్రంని కుంభకర్ణుడి కోసం వాడటం ఇష్టం లేకపోయినా జరుగుతుంది. ఇలా ఎన్నోసార్లు ఎంత మహా వీరుడైనా అతను చూసిన ఆటుపోట్లు అన్ని ఇన్ని కాదు.
ఇప్పుడదే తరహాలో ఇట్లు అర్జునకు వాయిదాల వలయం చుట్టుకుంది. ప్రమోషన్ల కోసం ఇప్పటికే చెప్పుకోదగ్గ మొత్తం ఖర్చు పెట్టారు. తమన్ అధిక భాగం ప్రమోషన్లలో పాలు పంచుకున్నాడు. నిర్మాతల్లో ఒకరైన వెంకీ కుడుముల తన నెట్ వర్క్ మొత్తం వాడి బజ్ పెంచడానికి ఎంత చేయాలో అంతా చేశారు. కొత్త హీరో అయినా సరే జనాలకు ఆ ఫీలింగ్ రాకుండా కంటెంట్ ఎంత రిచ్ గా ఉందో ప్రోజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. హీరోయిన్ అనస్వర రాజన్ కూడా చాలా యాక్టివ్ గా పబ్లిసిటీలో భాగమయ్యింది.
తీరా చూస్తే ఇప్పుడేమో ఇలా జరిగింది. పోనీ నవంబర్ 6 వెళదామంటే ప్యాన్ ఇండియా మూవీ రామాయణ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రిలీజవుతోంది. సూర్య సీన్ మెల్లగా క్రేజ్ పెంచుకుంటోంది. తెలుగు హక్కులకు డిమాండ్ ఏర్పడింది. ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉన్నా నయనతార మహాశక్తికి పెట్టుబడులు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఇవి కాకుండా చిన్న సినిమా సమ్మర్ హాలిడేస్ కూడా ఉంది. మరి ఇట్లు అర్జున ఏం పర్లేదంటూ దీపావళికే వస్తుందా లేక ఇంకో వన్ వీక్ లేటవుతుందా వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates