ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన ఒక బాలిక మృతి చెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏమి జరిగిందో తెలియక అటు విద్యార్థుల తలిదండ్రులు, ఇటు వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
అల్లూరి జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో పర్యటించిన వైద్య సిబ్బంది మలేరియా నివారణకు వినియోగించే క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఈ మాత్రలను స్వయంగా దగ్గరుండి మరీ మింగించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మాత్రలు వేసుకున్న కొన్ని గంటల్లోనే తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక మాడివి జామున చికిత్స పొందుతూ మరణించింది.
గ్రామంలో మొత్తం 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా వారిలో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 29 మందిని తెలంగాణాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మిపురం ప్రాధమిక వైద్యశాలకు తరలించారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగించింది. ఏడుగురు మాత్రమే పెద్దవారున్నారని అధికారులు తెలిపారు. బాలిక మరణంతో గొలగుప్ప గ్రామంలో విషాదం నెలకుంది.
బాలిక జమున మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యారోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన ఆయన పూర్తిస్తాయి విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే కాకినాడ నుంచి తొమ్మిది మందితో కూడిన వైద్య బృందం గొలగుప్ప గ్రామానికి చేరుకుంది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి మరో మూడు బృందాలు కూడా రానున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates