సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు

ఏమాత్రం అవకాశం దొరికినా చాలు మహిళలను లొంగదీసుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. పెద్ద మనుషుల ముసుగులో హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా దీనికి అతీతులు కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సన్నిహితుడు ఒకరు మహిళా వ్యాపారవేత్తను గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైదరాబాద్ ఔట్ డోర్ అడ్వర్టైజింగ్ సంస్థ మిథునా యాడ్స్ అధినేత్రి కే. శోభా రెడ్డి గత మూడేళ్లుగా చట్టబద్దమైన వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిచే వరకు రెవెన్యూ షేరింగ్ పద్దతిలో తనకు అవకాశం కల్పించాలని ఆమె ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఓ వ్యక్తిని కలిశారు. తన సమస్య వివరించి చెప్పారు. తనకు సహకరించాలని కోరారు.

దానికి ఆ పెద్ద మనిషి స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. వ్యాపార విషయాల గురించి మటాడేందుకు గెస్ట్ హౌస్ కు రావాలని పిలిచినట్లు శోభారెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలకు ట్యాగ్ చేశారు. సదరు పెద్దమనిషి పేరు బహిరంగంగా వెల్లడించేందుకు ఆమె ఇష్టపడలేదు. ఇదికాస్త నెటిజన్ల కంటపడింది. ముఖ్యమంత్రి సన్నిహితుడి వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

తెలంగాణాలో ఇప్పుడీ విషయం మీద హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకూ ఆ సన్నిహితుడు ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. నిఘా వర్గాలను రంగంలోకి దించి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.