తనపై భారీ అంచనాలు నెలకొన్నపుడు కబాలి, కాలా సినిమాలతో నిరాశపరిచాడు కానీ.. పా.రంజిత్ గొప్ప దర్శకుడనడంలో సందేహం లేదు. తొలి రెండు చిత్రాలు అట్టకత్తి, మద్రాస్.. రజినీ సినిమాల తర్వాత తీసిన సార్పట్ట, తంగలాన్ లాంటి చిత్రాలతో అతను తన స్థాయిని చాటిచెప్పాడు. ప్రతి సినిమాలోనూ దళిత ఐడియాలజీని జొప్పిస్తాడంటూ కొందరు అతణ్ని విమర్శించినా సరే.. పా.రంజిత్ కథలు కొత్తగా ఉంటాయి, తన టేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది.
కాకపోతే రంజిత్ పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుని మాత్రం చాలా కాలమైంది. సార్పట్ట థియేటర్లలో రిలీజైతే పెద్ద హిట్టయ్యేదేమో కానీ.. అది ఓటీటీకి పరిమితమైంది. తంగలాగ్ క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా అనుకున్నంత ఆడలేదు. ఐతే ఇప్పుడు వెట్టువం అనే క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా వరల్డ్‌ను పరిచయం చేస్తూ తాజాగా రంజిత్ ఒక ప్రోమో వదిలాడు. అది మైండ్ బ్లోయింగ్‌గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాల్లో ఫేమస్ అయిన మలకంబ్ ఆట నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దాడు రంజిత్. ఈ ఆట చరిత్ర అంతా తవ్వి.. ఆ నేపథ్యంలో ఇంటెన్స్ స్టోరీ అల్లినట్లున్నాడు రంజిత్. ఆర్య, శోభిత దూళిపాళ్ల, దినేశ్, కలైయరసన్ లాంటి ప్రధాన పాత్రధారులు తమ పాత్రల కోసం ఎంత కష్టపడ్డారో ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
ప్రోమోలో విజువల్స్, బీజీఎం, గ్రాండియర్ అన్నీ ఆకట్టుకున్నాయి. రానా దగ్గుబాటి ఈ సినిమాకు సమర్పకుడిగా, తెలుగులో నరేటర్‌గా వ్యవహరించడం విశేషం. రూ.25 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలుపెట్టి 75 కోట్లతో పూర్తి చేస్తున్నాడట రంజిత్. ఈ చిత్రానికి నిర్మాతలలో అతను కూడా భాగస్వామి. ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఖరారు చేయలేదు కానీ.. ఎప్పుడు వచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. కాకపోతే తెలుగులో వెట్టువుం (వేట అని అర్థం) అని కాకుండా తెలుగు టైటిల్ పెడితే బాగుండేది.
Gulte Telugu Telugu Political and Movie News Updates