స్విగ్గీ డెలివరీతో 53 లక్షలు ఎలాగబ్బా?

డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఏకంగా రూ.53 లక్షలు సంపాదించాడు చెన్నైకి చెందిన శంకర్. అవును.. మీరు విన్నది నిజమే. ఎనిమిదేళ్లుగా స్విగ్గీతోనే కొనసాగుతున్న అతడు.. తన కష్టంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చుకున్నాడు.

పిల్లలను బాగా చదివించాలన్నదే శంకర్ దంపతుల ప్రధాన లక్ష్యమట. ఈ క్రమంలో స్విగ్గీలో డెలివరీ పార్ట్‌నర్‌గా చేరిన శంకర్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం పనిచేశాడు.

ఏడాదికి రూ.6 లక్షలకు పైగా సంపాదించిన శంకర్.. ఎనిమిదేళ్లలో మొత్తం రూ.53 లక్షలు ఆర్జించినట్లు స్విగ్గీ వెల్లడించింది. తనకు నచ్చిన సమయంలో పనిచేసుకునే స్వేచ్ఛ ఈ పనిలో ఉండటం కూడా తనకు కలిసొచ్చిందని శంకర్ చెప్పాడు.

నిత్యం ట్రాఫిక్, కాలుష్యం, ఎండ, వర్షం వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థతో కొనసాగడం అంత సులభం కాదు. ఈ కష్టానికి వచ్చిన సంపాదనతో ఇప్పుడు పిల్లలను మంచిగా చదివించుకుంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గాయని శంకర్ తెలిపాడు.

స్విగ్గీ తన అంతర్గత వేదికల్లో డెలివరీ పార్ట్‌నర్ల విజయగాథలను పంచుకుంటూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన శంకర్ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏ పని అయినా కష్టపడి చేస్తే మంచి ఫలితం దక్కుతుందనే దానికి శంకర్ ప్రయాణం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.