రూ.10 చిల్లర కోసం గొడవ… ఆటో డ్రైవర్ మృతి

హైదరాబాద్‌లో కేవలం రూ.10 చిల్లర విషయంలో మొదలైన గొడవ ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు పోయే వరకు వెళ్లింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో 42 ఏళ్ల మహమ్మద్ ముఖర్రమ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో ఛార్జీకి సంబంధించిన రూ.10 చిల్లర విషయంలో ముఖర్రమ్‌కు ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగింది. రూ.200 నోటుకు చిల్లర ఇచ్చే విషయంలో మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముఖర్రమ్‌పై దాడి జరిగింది. తీవ్ర గాయాలతో ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఈ ఘటనపై బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ మరికొన్ని వివరాలు వెల్లడించారు. రూ.10 విషయంలో గొడవ తర్వాత అజీమ్ అనే వ్యక్తి మరికొందరిని పిలిపించాడని, ముఖర్రమ్‌ను భార్యాపిల్లల ముందే కొట్టారని ఆరోపించారు. అజీమ్, షోయబ్‌తో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

ముఖర్రమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అజీమ్, షోయబ్‌ను అనుమానితులుగా గుర్తించారు. దాడిలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, గొడవ మొదలైన తర్వాత ఏం జరిగిందనే వివరాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కూడా రావాల్సి ఉంది.