వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం అది బలం కాదని.. వాపు మాత్రమేనని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే అంచనాలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 25 ఎంపీ స్థానాల్లో 20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2024 ఎన్నికల్లో కూటమి 21 ఎంపీ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. అంటే కూటమి బలం పెద్దగా తగ్గలేదని ఈ అంచనాలు సూచిస్తున్నాయి.

మరోవైపు 2024లో నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైన వైసీపీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అంటే వైసీపీకి ఒక సీటు అదనంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో కూటమి ఆధిపత్యం కొనసాగుతుందని సర్వే లెక్కలు చెబుతున్నాయి.

చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు, పవన్‌ కల్యాణ్‌ ప్రభావం, బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌.. ఇవన్నీ కలిసి కూటమి బలాన్ని నిలబెడుతున్నాయి. మరోవైపు జగన్‌ పర్యటనలకు వస్తున్న జనస్పందనను వైసీపీ తన బలంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో సర్వే అంచనాలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.

అయితే ఇవి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వెలువడిన అంచనాలు మాత్రమే. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో 2029 నాటికి రాజకీయ సమీకరణాలు, ప్రజల అభిప్రాయాలు, పొత్తులు, ప్రభుత్వ పనితీరును బట్టి ఫలితాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.