‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి పాజిటివ్ టాక్ వస్తే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టొచ్చని ట్రేడ్ అంచనా వేసింది. కానీ ఒక పెద్ద స్టార్ నటించిన భారీ చిత్రం స్థాయిలో ఇది వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం రేపిన ‘ఇరుముడి’.. ఇప్పుడు రూ.200 కోట్ల మైలురాయి దిశగా అడుగులు వేస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఈ స్థాయిలో ఒక సినిమాను భుజాల మీద మోయడం చూడలేదు. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఏమీ లేకపోయినా.. బలమైన ఎమోషన్ ప్రేక్షకులను కట్డిపడేసి అనూహ్యమైన వసూళ్లు తెచ్చిపెట్టింది. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించడం సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ఒక ముఖ్య కారణంగా మారింది. మరి నిజ జీవితంలో పరమ అయ్యప్ప భక్తుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించి ఉంటే ఎలా ఉండేదన్న ఊహ చాలామందిని ఎగ్జైట్ చేసింది.

‘ఇరుముడి’లో రామ్ చరణ్ క్యామియో ఉంటుందని విడుదలకు ముందుకు ఒక ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే దర్శకుడు శివ నిర్వాణ ముందే ఈ ప్రచారాన్ని ఖండించేశాడు. కానీ ఈ చిత్రంలో చరణ్ క్యామియో చేస్తే ఎలా ఉండేదన్న ఆలోచన చేసినట్లు నిర్మాత రవిశంకర్ యలమంచిలి తాజాగా చెప్పడం విశేషం. ముందు తమకీ ఆలోచన లేకపోయినా.. మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తర్వాత తమకీ ఆలోచన వచ్చిందని ఆయనన్నారు.

నిజంగా ‘మల్లెపూల పల్లకి’లో చరణ్ క్యామియో చేస్తే అని ఆలోచించామని.. కానీ అప్పటికే ఆలస్యం అయిందని.. ఒకవేళ తాము చరణ్‌ను అడిగి, ఆయన ఒప్పుకుని, నిజంగా ఆ పాటలో తళుక్కుమని ఉంటే మాత్రం అద్భుతంగా ఉండేదని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మైత్రి సంస్థతో రామ్ చరణ్‌కు మంచి అనుబంధమే ఉంది. ఆ సంస్థలోనే రంగస్థలం లాంటి మరపురాని చిత్రం చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాను కూడా చరణ్ మైత్రి బేనర్లోనే చేయబోతున్నాడు. కాబట్టి ఈ సంస్థ అధినేతలు అడిగితే.. ‘ఇరుముడి’లో క్యామియోకు చరన్ ఒప్పుకున్నా ఒప్పుకునేవాడేమో.