అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దానికి భిన్నమైన ఫలితం రావడం నందమూరి అభిమానులను నిరాశ పరిచింది. అయితే దాని తర్వాత దర్శకుడు బోయపాటి శీను ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టలేదు. అదిగో ఇదిగో అంటూ వార్తలు వినడం తప్పించి సాలిడ్ గా ప్రాజెక్టు మొదలైన దాఖలాలు కనిపిస్తే ఒట్టు. ప్రచారాలైతే జోరుగా ఉన్నాయి.
బోయపాటి శీను గతంలోనే గీతా ఆర్ట్స్ కో కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. అది సరైనోడు 2 అనే ప్రచారం పుష్ప టైంలో బాగా జరిగింది. అయితే ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక అల్లు అర్జున్ ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడో వచ్చిన తన పాత హిట్లకు పార్ట్ 2కు తీసే మూడ్ లో లేడు. అందుకే ఇద్దరు తమిళ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డిఫరెంట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. అట్లీ, లోకేష్ కనగరాజ్ చాలా క్రేజీ కాంబోలుగా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేపాయి.
సో బోయపాటికి బన్నీ ఆప్షన్ లేనట్టే. కొత్తగా అఖిల్ పేరు వినిపిస్తోంది. లెనిన్ తో కంబ్యాక్ అయ్యాక ఎవరితో చేస్తాడనే దాని పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తను కూడా తొందరపడే ఉద్దేశంలో లేడు. ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. బోయపాటి మాస్ సినిమాల్లో సిద్ధహస్తులే కానీ యంగ్ హీరోల విషయంలో కొంచెం తడబడతారు. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము, రామ్ స్కంద లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇంకో వర్గం దగ్గుబాటి రానా పేరు కూడా తెర మీదకు తీసుకొచ్చింది. అయితే బోయపాటి శీను ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇప్పట్లో తెగేలా లేదు లేదు. ఎందుకంటే స్టార్ హీరోల డైరీలన్నీ రెండు మూడేళ్లు బిజీగా ఉన్నాయి. టయర్ 2 హీరోల దగ్గర కూడా పెద్ద వెయిటింగ్ లిస్టు ఉంది. మరి బోయపాటి ఏ నిర్మాతతో చేతులు కలిపి ఏ హీరోని లాక్ చేసుకుంటారనేది ఇంకొంత కాలం ఆగితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. అఖండ 2 కనక విజయం సాధించి ఉంటే మూడో భాగం ఉండేదేమో కానీ ఇప్పుడా ఛాన్స్ లేనట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates