బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇంటర్వ్యూలు బుక్ చేసుకున్న పలువురు దరఖాస్తుదారులకు కూడా అపాయింట్‌మెంట్లు రద్దయ్యాయని ఈమెయిల్స్ వచ్చినట్లు సమాచారం.

ఈ పరిణామంతో అమెరికా వీసాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దరఖాస్తుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయులకు ఈ వార్త టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలను కూడా మరో తేదీకి రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేయడానికి కారణం వేరే ఉందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కాన్సులర్ అధికారులకు తప్పనిసరి, విస్తృత స్థాయి శిక్షణ నిర్వహించాల్సి ఉండటంతో ఈ తాత్కాలిక విరామం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వీసా దరఖాస్తులను ఒకే విధమైన ప్రమాణాలతో పరిశీలించేలా అధికారులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాలు, ఇతర కేటగిరీల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొంది.

ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసే దిశగా పలు మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థి వీసాల నుంచి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ వరకు మరింత కఠినమైన స్క్రీనింగ్ ఉండేలా మార్పులు చేసే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ వీసా అపాయింట్‌మెంట్లపై విరామం ఎప్పటి వరకు కొనసాగుతుందనే దానిపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వలేదు. దీంతో అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నవారు ప్రస్తుతానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.