వంద కోట్ల బోణీ సులభంగా కనపడుతోంది

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. తెల్లవారుఝామున ప్రీమియర్ షోలు ఏపీలో ఆరు వందలు పెట్టడంతో అవి కొంచెం నెమ్మదిగా ఉన్నాయి కానీ యాభై, వంద హైక్స్ తీసుకున్న రెగ్యులర్ షోలు వేగంగా అయిపోతున్నాయి. రేపు మిలాద్ నబి పండగ సెలవు రోజు రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొనబోతోంది.

ఇప్పటికే అడ్వాన్స్ లోనే అరవై కోట్లు దాటేసిన టాక్సిక్ మొదటి రోజు ఓపెనింగ్ ఈజీగా వంద కోట్లు దాటేలా ఉంది. ఎందుకంటే కరెంట్ బుకింగ్ రేపటికి చాలా జరుగుతుంది. స్క్రీన్ కు అయిదు షోల చొప్పున చూసుకున్నా నేరుగా వచ్చి కొనేవాళ్ళు లక్షల్లో ఉంటారు. సో అదంతా కలుపుకుంటే సెంచరీ దాటడం సులభమే. హిందీ కూడా నేనేం తక్కువ అనేలా పోటీ పడుతోంది. ముఖ్యంగా నార్త్ బిసి సెంటర్స్ లో ఆన్ లైన్ కన్నా ఎక్కువగా కౌంటర్లకే ప్రాధాన్యం ఇస్తారు.

ఉదయం పది గంటల లోపు వచ్చే టాక్ టాక్సిక్ కు చాలా కీలకం కానుంది. పాజిటివ్ వస్తే మటుకు ఆకాశమే హద్దవుతుంది. అయితే తెలుగులో ఇరుముడి రూపంలో బలమైన పోటీ ఉంది కానీ టాక్సిక్ కి ఎక్కువ థియేటర్లు దక్కడం ప్లస్ అయ్యేలా ఉంది. పబ్లిక్ నుంచి బాగుందనే మాట బయటికి వెళ్తే చాలు ఆటోమేటిక్ గా మార్నింగ్ షోల నుంచే పికప్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ జనాలు ఎగబడటం ఖాయం. కెజిఎఫ్ రేంజ్ టాక్ రావడం కీలకం.

ప్రమోషన్ల పరంగా టీమ్ మొత్తం ఎంత చేయాలో అంతా చేసింది. గ్రౌండ్ లెవెల్ లో బజ్ పుష్ప స్థాయిలో కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నా కానీ ఇలాంటి వాటికి బజ్ తో సంబంధం ఉండదు. దురంధర్ నెగటివ్ ప్రీ బజ్ దాటుకుని రికార్డులు సృష్టించింది. టాక్సిక్ మీద శాండల్ వుడ్ పరిశ్రమ ఆ స్థాయిలో అంచనాలు పెట్టుకుంది. యష్ నాలుగేళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో ఇంకొద్ది గంటల్లో  తేలనుంది. బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చూద్దాం.