30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు ఫ‌లాల‌ను ఇప్పుడు తానే ప్రారంభించే అవ‌కాశం ద‌క్కింద‌ని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. 30 ఏళ్ల కింద‌ట ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను ప్ర‌కాశం జిల్లా వాసుల క‌ల అయిన‌.. వెలిగొండ ప్రాజెక్టుకు శంకు స్థాప‌న చేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే.. ఈ సుదీర్ఘ‌కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవ‌కాశం.. ప్రారంభించే అవ‌కాశం కూడా త‌న‌కే ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలిద‌శ ప‌నులు పూర్తి కానున్నాయి. ఈ నేప‌థ్యంలో తొలిద‌శ ప్రాజెక్టును సీఎం చంద్ర‌బాబు ఈ నెల 31న ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్ర‌కాశం జిల్లాలోని ప‌శ్చిమ ప్రాంతం రూపురేఖ‌లు స‌మూలంగా మార‌నున్నాయ‌ని తెలిపారు. ద‌శాబ్దాల త‌ర‌బడి ఇక్క‌డి రైతులు.. ఎదుర్కొంటున్న సాగు నీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు 30 ఏళ్ల కింద‌టే తాను ఆలోచ‌న చేశాన‌ని.. అప్పుడే ఇక్క‌డి వాసులను క‌లుసుకుని.. వెలిగొండ‌కు శంకుస్థాప‌న చేశాన‌ని గుర్తు చేసుకున్నారు.

అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. ఎక్క‌డా వెనుకంజ వేయ‌కుండా ముందుకు సాగిన విష‌యాన్ని చంద్ర‌బాబు తెలిపారు. ఒక భ‌గీర‌థ ప్ర‌య‌త్నంతో తాను చేసిన సంక‌ల్పం నెర‌వేరుతున్న క్ష‌ణాలు చాలా గొప్ప‌వ‌ని ఆయ‌న పేర్కొన్నారు. వెలిగొండ ఫేజ్ 1 ద్వారా.. కృష్ణా న‌ది నీటిని ఇక్క‌డి వారికి అందించ‌నున్న‌ట్టు తెలిపారు. 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణినికి నేనే శంకుస్థాపన చేశా. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత‌.. ఈనెల 31న ప్రాజెక్టును ప్రారంభించబోతున్నా. అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా నాటి ఫొటోల‌ను కూడా ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేరుతున్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు టీడీపీని, ప్ర‌భుత్వాన్ని ఎంత‌గానో ఆద‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇటీవ‌ల విడ‌త‌ల వారీగా నిధులు మంజూరుచేసి వెలిగొండకు భూములు ఇచ్చిన రైతుల‌ను ఆదుకున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మాయ చేసింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్రాజెక్టు ప‌నులు పూర్తి కాకుండానే పూర్త‌యిన‌ట్టు పేర్కొని నాడు డ్రామా ఆడింద‌న్నారు. అందుకే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీకి త‌గిన విధంగా బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు.

వెలింగొండ ప్రాజెక్టు ఫేజ్ 1తో జ‌రిగే ప్ర‌యోజ‌నాలు

1) సాగునీరు: వెలిగొండ మొదటి దశ ద్వారా ప్రకాశం జిల్లాలో సుమారు 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
2) తాగునీరు: ఫేజ్ 1 ద్వారా దాదాపు 4 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయి.
3) కృష్ణా జలాల తరలింపు: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా వరద నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు నేరుగా తరలించడానికి మార్గం సుగమమవుతుంది.
4) ఫ్లోరైడ్ నివారణ: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫేరైడ్, కరవు పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.