‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత వేణు చేస్తున్న సినిమా కావడంతో ముందే మంచి ఫోకస్ వచ్చింది. పైగా డీఎస్పీ మొదటిసారి పూర్తి స్థాయి హీరోగా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరో రకమైన అంచనాలు కూడా ఉన్నాయి. కానీ రిలీజ్ దగ్గరికి వచ్చాక ఇక్కడ ఒక పోటీ మొదలవ్వొచ్చు.
అదే ‘దేవి’ vs ‘ప్రసాద్’. డీఎస్పీకి సినిమా మ్యూజిక్‌లో మొదటి అడుగు ‘దేవి’తోనే పడింది. 1999లో వచ్చిన ఆ సినిమాతోనే ఆయన ఫిల్మ్ కంపోజర్‌గా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ‘దేవి శ్రీ ప్రసాద్’ అనే పేరు సంగీతంతోనే పెరిగింది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’లో మాత్రం మొదటిసారి ‘ప్రసాద్’ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనుకోవచ్చు.
మ్యూజిక్ విషయంలో డీఎస్పీకి కొత్తగా నిరూపించుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ తనే హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి పాటలు, నేపథ్య సంగీతం దగ్గర ఇంకాస్త ఎక్కువగా కష్టపడే అవకాశం ఉండొచ్చు. పైగా ‘ఎల్లమ్మ’ గ్రామీణ కథ. జాతరలు, ఫోక్ టచ్, పర్షి అనే కళాకారుడి పాత్ర.. ఇవన్నీ డీఎస్పీకి మ్యూజిక్ పరంగా మంచి స్పేస్ ఇస్తాయి.
అసలు చాలెంజ్ మాత్రం నటన దగ్గరే. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ చేస్తూ సెట్స్‌లో ఉన్న అనుభవం ఒకటి. కెమెరా ముందు పూర్తి సినిమా మోయడం ఇంకొకటి. డైలాగ్ చెప్పడం, ఎమోషన్ చూపించడం, పాత్రలో సహజంగా కనిపించడం.. ఇవన్నీ మొదటిసారి అంచనాలకు తగ్గట్లుగా చేయడం చిన్న విషయం కాదు. పైగా పర్షి పాత్ర రెగ్యులర్ కమర్షియల్ హీరోలా కనిపించడం లేదు.
వేణు యెల్దండికి ఇక్కడ పెద్ద పని అదే. ‘బలగం’లో నటుల నుంచి సహజమైన నటన తీసుకున్నాడు. ఇప్పుడు డీఎస్పీలో ఉన్న హీరోను కూడా అలానే బయటకు తీస్తే ‘ఎల్లమ్మ’ తర్వాత లెక్క మారొచ్చు. మ్యూజిక్ కోసం డీఎస్పీ పేరు చూసే వాళ్లు, నటుడిగా కూడా అతన్ని అంగీకరిస్తారా అన్నది ఈ సినిమాతో తేలుతుంది. సినిమా రిలీజ్ తర్వాత పాటలు హైలెట్ అయితే ‘దేవి’ తన పని చేసినట్టే. పర్షి పాత్ర ఎక్కువగా మాట్లాడుకుంటే ‘ప్రసాద్’ కూడా గెలిచినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates