టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత స్టార్ డైరెక్టర్లకు ఒక్క ఫోన్ చేస్తే ప్యాన్ ఇండియా సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న టైంలో యష్ ఈవిడకు ఓకే చెప్పడం అప్పట్లో సంచలనం. ఎందుకంటే గీతూ కమర్షియల్ డైరెక్టర్ కాదు. వందల కోట్ల చిత్రాలు తీసిన అనుభవమూ లేదు. కానీ ఒక క్లాసిక్ ఫిలిం మేకర్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది. మన టాలీవుడ్ తోనూ కనెక్షన్ ఉంది.
గీతూ మోహన్ ప్రస్థానం చైల్డ్ ఆర్టిస్ట్ గా 1986లో మొదలయ్యింది. మోహన్ లాల్ ‘ఒన్ను ముతల్ పూజ్యం వారే’లో బాలనటిగా పరిచయమయ్యారు. తమిళం సూపర్ హిట్ ‘ఎన్ బొమ్ముకుట్టి అమ్మవుక్కు’లో టైటిల్ రోల్ పోషించి ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు. 2000 సంవత్సరంలో హీరోయిన్ గా అదే మోహన్ లాల్ సరసన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో మేకప్ వేసుకున్నారు. మరుసటి ఏడాది ఈవీవీ డైరెక్షన్లో వేణు తొట్టెంపూడి సరసన ‘వీడెక్కడి మొగుడండీ’తో పరిచయమయ్యారు. అది ఫ్లాప్.
2009లో ‘కెల్క్కున్నుందో’ షార్ట్ ఫిలిం ద్వారా దర్శకురాలిగా కొత్త అడుగులు వేశారు. 2013 హిందీలో తీసిన ‘లైయర్స్ డైస్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు జాతీయ అవార్డులతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు నోచుకుంది. 2019 ‘మూతన్’కు సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి స్క్రీన్ ప్లేకు గాను గ్లోబల్ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్నారు. గీతూ మోహన్ దాస్ భర్త రాజివ్ రాయ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ నా పేరు సూర్యకు ఆయనే కెమెరా మ్యాన్
ఇంత నేపథ్యంతో గీతూ మోహన్ దాస్ తన టాక్సిక్ కథ చెప్పి యష్ ని ఒప్పించగలిగారు. ఛాయాగ్రహణ బాధ్యతలు రాజీవ్ రాయే నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన గీతూ మోహన్ దాస్ కెరీర్ ఒక ఎత్తు అయితే టాక్సిక్ తో హిట్టు కొడితే ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం మరో మైలురాయవుతుంది. చాలా రిస్క్ అనిపించే ఇలాంటి నిర్ణయం తీసుకున్న యష్ ఆమెలో మేకర్ కి అంత గౌరవం ఇచ్చి నాలుగేళ్లు ఒక్క సినిమాకు ఖర్చు పెట్టాడు. దానికి ఎలాంటి ఫలితం దక్కనుందో రేపు తేలిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates