పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే ఉన్నాం. నిర్మాత నాగబాబుని ఏకంగా ఆత్యహత్య చేసుకునే ఆలోచన తెప్పించిన ఆరెంజ్ మొన్న ఏడాది తెచ్చిన కలెక్షన్లు చూసి థియేటర్ ఓనర్లు నివ్వెరబోయారు. పాటల కోసం యూత్ ఇంతగా ఎగబడతారని అనుకోలేదని సంబరపడ్డారు. తర్వాత ఇంకో రెండు మూడుసార్లు విడుదల చేసినా రిజల్ట్ మళ్ళీ పాజిటివ్ గానే వస్తోంది.  

మహేష్ బాబు ఖలేజాది కూడా ఇదే కథ. థియేటర్లలో ఆడని ఈ మూవీ టీవీ, యూట్యూబ్ లో వచ్చాక కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. రీ రిలీజ్ చేసినప్పుడు కొత్త సినిమాలను దెబ్బ తీసినంత పని చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 పంజాని పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం 2011లో వచ్చిన పంజా అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్ అయ్యింది. చాలా చోట్ల బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

ఇప్పుడు చూస్తేనేమో పంజా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెడీ అవుతున్నారు. ప్రతి సెంటర్ లో స్పెషల్ షోలు వేసి వాటికి ప్రత్యేకంగా ఆయుధాల మోడల్ లో టికెట్లు ముద్రించి అమ్ముతున్నారు. రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు సిద్ధ పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ లాంటి మెయిన్ సెంటర్స్ లో సంబరాలు అంబరాన్ని తాకేలా ప్లాన్ చేస్తున్నారు. ఓజి రేంజ్ లో యుఫొరియా ఉంటుందని కొందరు వీర ఫ్యాన్స్ ముందస్తు అంచనా వేయడం గమనార్హం.

తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన పంజాలో పవన్ కళ్యాణ్ స్టయిలింగ్, యువన్ శంకర్ రాజా సంగీతం పెద్ద ప్లస్ అయ్యాయి. హీరోయిన్లు, సెకండాఫ్ లో ట్రాక్ తప్పిన కామెడీ, గ్యాంగ్ స్టర్ డ్రామా నుంచి కథనం డైవర్ట్ కావడం లాంటి కారణాలు ప్రేక్షకులని నిరాశ పరిచాయి. మరి ఇంత కాలం తర్వాత పంజా ఎందుకు ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుందంటే దానికి సమాధానం ఒకటే. ఇప్పుడు వస్తున్న ఎన్నో  సినిమాల కన్నా పంజా లాంటి వింటేజ్ మూవీస్ చాలా బెటర్ గా తోస్తున్నాయి కాబట్టి.