కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కు తొలి బ‌డ్జెట్‌నే నిధులు కేటాయించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎంతో ఆశ పెట్టుకున్న ప‌థ‌కాల‌కు ఈ బ‌డ్జ‌ట్‌లోనే సింహ‌భాగం నిధుల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా తొలి బ‌డ్జెట్‌లోనే సీఎం విజ‌య్ త‌న‌దైన ముద్ర వేయ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్ ఈ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నిక‌ల హామీల‌ను తాము ప్ర‌ధానంగా భావిస్తున్న‌ట్టు తొలి ప్ర‌సంగంలోనే విల్స‌న్ చెప్పారు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేస్తారా?  ఆమేర‌కు నిధులు ఉన్నాయా ? అంటూ.. ప్ర‌తిప‌క్షాలు గేలిచేశాయ‌ని, కానీ, త‌మ‌కు అన్నీ తెలిసే హామీలు ఇచ్చామ‌న్నారు. ఎక్క‌డా రాజీ ప‌డేది లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొత్త‌గా వివాహం చేసుకునే యువ‌తుల‌కు తులం బంగారంతోపాటు ప‌ట్టుబ‌ట్ట‌లు పెట్టేందుకు.. 800 కోట్ల‌రూపాయ‌ల‌ను బ‌డ్జెట్లో కేటాయించామ‌న్నారు.

`అన్న పెళ్లి కానుక‌`(అన్న‌న్ సీర్‌తిట్టం) పేరుతో ఈప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. “మేన మామ కానుక‌“ పేరుతో కొత్త‌గా జ‌న్మించే బిడ్డ‌ల‌కు.. ఒక గ్రాము బంగారంతో రూపొందించిన ఉంగ‌రం, దుస్తులు.. బేబీకి కావాల్సిన స‌క‌ల వ‌స్తువుల‌ను అందించ‌నున్నారు. దీనికి 500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా కేటాయించారు. అలాగే..  పాఠశాల విద్యాశాఖకు 44,527 కోట్ల రూపాయ‌ల‌ను, ఉన్నత విద్యాశాఖకు 8,393 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.

ఇక‌, కాలేజీల్లో చ‌దివే పేద విద్యార్థుల‌కు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు వీలుగా 2 వేల‌ కోట్ల రూపాయ‌ల ను కేటాయించారు. దీనిని ‘వెట్రి ల్యాప్‌టాప్‌ పథకం’ గా అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆధునీక‌రించేందుకు కాలేజీల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు 300 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.  ఇంట‌ర్‌లో ప్ర‌వేశించిన విద్యార్థుల‌కు హెల్మెట్‌, వాటర్‌ బాటిల్‌తో కూడిన సైకిళ్లు అందించే ‘పుతియా పయనం.. పుతియా వేగం’ పథకానికి  277 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.

ఇత‌ర ప‌థ‌కాల‌కు కూడా..

ఇత‌ర ప‌థ‌కాల‌కు కూడా విరివిగానే నిధులు కేటాయించారు. ‘వెట్రి స్కిల్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌’ను ప్రకటించారు. 13 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. క్రీడారంగ అభివృద్ధికి 10 ఒలింపిక్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పింఛ‌న్ల‌ను పెంచుతామ‌న్న హామీని వ‌చ్చే ఏడాది నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా.. ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్.. వ‌చ్చే ఏడాది మార్చి 31వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది.