ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే.. ఈ ఏడాది మ‌రింత‌గా ఈ రేటింగ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. 36కు చేరుకోవ‌డంతో రిప‌బ్లిక‌న్‌నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల స‌మ‌యంలో అధ్య‌క్షుడి రేటింగ్ పార్టీకి అత్యంత కీల‌కం. ఈ రేటింగ్ ఆధారంగానే ప్ర‌జ‌లు ఓటేస్తారు. ఇప్పుడు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. ప‌లు స‌ర్వేలు రేటింగ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని రిపోర్టు ఇవ్వ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు దారి తీసేలా చేసింది. అమెరికా చ‌రిత్ర‌లోనే తొలిసారి అధ్య‌క్షుడికి రేటింగ్ ఈ రేంజ్‌లో త‌గ్గ‌డంపైనా ప్ర‌జ‌లు విస్తు బోతున్నారు.

తాజాగా.. జాతీయ సర్వేల సగటు ప్రకారం ట్రంప్ పనితీరుకు మద్దతు 36% – 38% మధ్య ఉంది. జనవరి 2025లో ఆయన రెండో విడత పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజాదరణ 47% వద్ద ప్రారంభమైంది. కాలక్రమేణా ఆయన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. వివిధ ప్రముఖ సర్వేల(న్యూయార్క్ టైమ్స్, గాలప్) నివేదికల ప్రకారం ఇది కనిష్టంగా 30% వరకు, గరిష్టంగా 40% వరకు నమోదవుతోంది. వాస్త‌వానికి గ‌తంలో ఎప్పుడూ అధ్య‌క్షుల రేటింగ్ 45 % పైగానే ఉండేది. కానీ, ట్రంప్ రేటింగ్ మాత్రం త‌గ్గుముఖం ప‌డుతూ వ‌చ్చింది.

ఏంటి కార‌ణాలు..?

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గడానికి ప్రధానంగా ద్రవ్యోల్బణం, టారిఫ్ విధానాలు, విదేశీ యుద్ధాలు వంటి కారణాలు ఉన్నాయి.
  • ద్రవ్యోల్బణం, జీవన వ్యయం: నిత్యావసరాల ధరలు పెరగడం, గృహ, ఆర్థిక నిర్వహణ భారమవ్వడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
  • టారిఫ్ పెంపు: ట్రంప్ అమలు చేసిన కఠినమైన దిగుమతి సుంకాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భార‌త్ వంటి బ‌ల‌మైన స్నేహ‌పూరిత దేశంపై భారీ సుంకాలు విధించ‌డాన్ని అమెరిక‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు.
  • ఇరాన్‌తో యుద్ధం: ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణల వల్ల ఆర్థిక భారం పెరగడం, ప్రాణనష్టం సంభవించడం పట్ల అమెరికన్లలో వ్యతిరేకత వ్యక్తమైంది.
  • మద్దతు కోల్పోవడం: స్వపక్ష నేతలు, స్వతంత్ర ఓటర్లు కూడా ట్రంప్‌ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ట్రంప్ రేటింగ్ మ‌రింత దిగ‌జారిపోయింద‌ని అంటున్నారు.
  • వీసాలు, విద్యార్థులు: విదేశీ విద్యార్థుల విష‌యంలో ట్రంప్ అవ‌లంభిస్తున్న వైఖ‌రికూడా ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక‌, వ్యాపార వేత్త‌లు విదేశీ విద్యార్థుల‌పై విధిస్తున్న క‌ఠిన ఆంక్ష‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇది కూడా ట్రంప్ రేటింగ్‌పై ప్ర‌భావం చూపిస్తోంది.
  • ర‌ష్యాపై ఆంక్ష‌లు: ఇటీవ‌ల ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తూ తీసుకున్న నిర్ణ‌యం.. కూడా ట్రంప్‌కు అంత‌ర్గ‌తంగా సెగ పెంచుతోంది. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇవ్వడాన్ని వ్య‌తిరేకించ‌క‌పోయినా.. ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

+నిరుద్యోగం: అమెరికాలో ఉపాధి క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్న ట్రంప్‌.. ఈ వాగ్దానాన్ని మ‌రిచిపోయారన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు నిరుద్యోగం పెరుగుతోంది. ఇవ‌న్నీ గంప‌గుత్త‌గా ట్రంప్‌ప్ర‌జాద‌ర‌ణ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి.