సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్న విషయం తెలిసిందే. రైలు పట్టాలపై పడుకుని, కూర్చుని చేస్తున్న రీల్స్.. వరదల ధాటిలో నిలబడి చేస్తున్న వీడియోలు ప్రాణాలు హరిస్తున్నాయి. అయితే.. వీటికి భిన్నంగా తమిళనాడుకు చెందిన ఓ మహిళా యూట్యూబర్ చేసిన పని.. అసలుకే ఎసరు పెట్టింది. ఆమె చేసిన రీల్స్ వ్యూస్ కోసమే.. అయినా.. మొత్తంగా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో లబోదబో మంటూ.. పోలీసుల చుట్టూ తిరుగుతోంది. తప్పయిపోయింది.. ఇక, రీల్స్ చేయను అని భర్తకు మొర పెట్టుకునే వరకు విషయం వెళ్లింది. రీల్స్ చేసేవారు ఎంత వరకు ఉండాలి.. ఎంత వరకు హద్దులు పాటించాలనే విషయాలు.. ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
విషయం ఏంటంటే..
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన మధుమిత యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యూస్ కోసం.. ఆమె ఎప్పటి సమాచారం అప్పుడే పంచుకుంటుంది. తన భర్త ఎంత సంపాదిస్తాడో..వారి వ్యాపారంతో ఎన్ని లాభాలు వస్తున్నాయో.. వారు ఎక్కడెక్కడ ఎలాంటి ఇళ్లు కట్టుకున్నారో.. ఇలా ఏదీ దాచుకోకుండా చెప్పేస్తూ.. యూట్యూబ్, ఇన్‌స్టాలో వ్యూవర్స్‌ను సంపాయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె.. తన పడగదిలోను, పూజా మందిరంలోనూ కూడా రీల్స్ చేశారు. ఈసందర్భంగా ఆమె తమ వద్ద ఉన్న డబ్బుల కట్టలను ప్రదర్శించారు. అలానే బంగారు ఆభరణాలను కూడా పంచుకున్నారు.
500 రూపాయల నోట్ల కట్లను పైకి కిందికి విసిరేస్తూ.. ఇదిగో ఇదంతా మాదే.. అంటూ గొప్పలు పోయారు. ఇక, ఒంటినిండా బంగారం వేసుకుని.. అదనంగా ఉన్న బంగారు నగలను కూడా చూపించారు. అంతేనా.. అక్కడితో కూడా ఆమె ఆగలేదు. వాటిని ఎక్కడెక్కడ ఎలా భద్రపరుస్తారన్న విషయాలను కూడా చెప్పేశారు. మొత్తంగా రీల్స్ ద్వారా వ్యూస్ పెంచుకునేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. రోజులు గడిచాయి. కుటుంబంతోపాటు ఆమె బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఏముంది.. అంతా ఖాళీ!. ఆ డబ్బు, నగలు కూడా పోయాయి. దీంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది.
ఏం జరిగింది?
మధుమిత రీల్స్ చూసిన దొంగలు.. వాటిని ఆమె ఎక్కడెక్కడ దాస్తుందో కూడా వివరించే సరికి.. ఆశ పుట్టింది. దీంతో ముగ్గురుదొంగలు రెక్కీ నిర్వహించి మరీ.. మధుమిత కుటుంబం లేని సమయంలో వెనుకవైపు పెద్ద గొయ్యి తవ్వి వచ్చి.. వీటిని దోచుకున్నారు. ఇంటికి సీసీకెమెరాలు ఉన్నా.. వాటిని ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రీల్స్‌ను హద్దుదాటి చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా రీల్స్ మోజులో పడిన వారికి ఇది కూడా ఒక గుణపాఠం!.
Gulte Telugu Telugu Political and Movie News Updates