పెళ్లి కోసం 12 గంటల పెరోల్

పెళ్లంటే నూరేళ్ళ పంట అనేది పాత సినిమాలో హిట్టయిన పాట. హరియాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా మాత్రం పెళ్లంటే 12 గంటల పెరోల్ అని పాడుకుంటున్నాడు. రెండు రోజులుగా ఈ కొత్త పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా కు చాలా పెద్ద క్రైం హిస్టరీ వుంది. బయట వుంటే నేరాలు చేస్తున్నాడని లోపల వేస్తే అక్కడ కూడా సింపుల్ గా ఓ హత్య చేసి కుక్కతోక వంకర అని నిరూపించుకున్నాడు.

హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బద్లీకి చెందిన మైన్‌పాల్ ఢీల్లాపై అనేక క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం 22 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. 2007, 2010లో మూడు కేసుల్లో దోషిగా తేలడంతో హిసార్ జైలుకు వెళ్లి కొంతకాలం శిక్ష అనుభవించాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఊరికే కూర్చోవాలంటే బోర్ కొట్టినట్లుంది. సరదాగా, సింపుల్ గా ఓ హత్య చేశాడు. జైల్లో సాటి నిందితుడిని కొట్టి చంపినట్లు ఆరోపణలు వున్నాయి.

ఏమి చేసాడో ఎలా నమ్మించాడో తెలియదు కానీ ఆరు వారాల పెరోల్ మీద 2018లో బయటకు వచ్చాడు. పోలీసులతో నమ్మకంగా వున్నట్లు నటిస్తూనే తెరవెనక కుట్ర చేశాడు. పక్కా ప్లాన్ తో సోను కుమార్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. పోలీసుల కళ్లుగప్పి కంబోడియా పారిపోయాడు. ఆ తర్వాత ఆరేళ్ళ పాటు అతడి ఆచూకీ లేకుండా పోయింది. పోలీసులు కూడా ఢిల్లా కేసును పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి.

ఇంతకూ ఈ ఆరేళ్లలో మనోడు ఏమి చేశాడంటే ఏడాదిన్నరకు ఒకడ్ని చొప్పున హాయిగా నలుగురు పిల్లల్ని కన్నాడు. కంబోడియాకు వెళ్ళిపోయిన ఢిల్లా బుద్దిగా వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక శుభముహూర్తాన మెటా చాన్ పరిచయమైంది. ఆమె అందాన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఐ లవ్ యూ చెప్పేశాడు. ఆమెతో ఏకంగా కాపురం పెట్టేశాడు. అదేనండి సహాజీవనం చేశాడు. వరసగా నలుగురు పిల్లల్ని కన్నాడు.

ఈలోపు ఎక్కడో ఢిల్లా బ్యాక్ గ్రౌండ్ లీక్ అయ్యింది. వెంటనే కంబోడియా పోలీసులు హరియాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలస్యంగా నిద్ర లేచిన మన పోలీసులు ఎప్పటిలాగే ఒక రెడ్ నోటిస్ జారీ చేశారు. 2024 నవంబర్లో నోటీసు జారీ చేస్తే 2025 జులైలో అతడి ఆచూకీ పసిగట్టారు. సెప్టెంబర్లో కంబోడియా పోలీసులు అతడ్ని ఇండియకు అప్పగించారు. ఇది మన ఢిల్లా స్టోరీ.

ఇప్పుడిదంతా ఎందుకంటే…ఏడాది కాలంగా ఝజ్జర్ జైల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఢిల్లా ఆరేళ్లు సహాజీవనం చేసిన ప్రియురాలు మెటా చాన్ ను వివాహం చేసుకునేందుకు పెరోల్ అడిగాడు. మళ్ళీ ఎక్కడ పారిపోతాడోనని పెరోల్ ఇచ్చేందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరికి 12 గంటల పెరోల్ ఇచ్చారు. జైలుకు సమీపంలోనే ఒక ఫాం హౌస్ లో ఢిల్లా, చాన్ వివాహం జరిగింది. ముచ్చట తీరకుండానే ఢిల్లాను పోలీసులు మళ్ళీ జైలుకు పంపించి ఊపిరి పీల్చుకున్నారు. 12 గంటల పెరోల్ మీద వచ్చి పెళ్లి చేసుకోవడం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.