భాగ్య‌న‌గ‌రంలో ఒంట‌రి జీవులు.. !

దేశ‌వ్యాప్తంగా ఒంట‌రి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ స‌హా మ‌రో రెండు సంస్థలు చేసిన స‌ర్వే ఔన‌నే స‌మాధానమే చెబుతోంది. అయితే.. వీరిలో పెళ్లికాని వారి సంగ‌తి ఎలా ఉన్నా.. పెళ్ల‌యి.. విడాకులు తీసుకునే వారి సంఖ్య మ‌రింత పెరుగుతోంద‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌కు, ఆందోళ‌న‌కు కూడా దారి తీస్తోంది. వీటిలోనూ హైద‌రాబాద్‌, ఢిల్లీ, బెంగ‌ళూరు, చెన్నైలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయ‌ని స‌ర్వే వెల్ల‌డిస్తోంది. దేశవ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల స్థితిగతులు.. వారి జీవ‌న విధానాల‌ను ఆయా సంస్థలు అధ్య‌య‌నం చేసిన‌ట్టు వెల్ల‌డించాయి.

ఏం జ‌రుగుతోంది?

స‌హ‌జంగానే స‌మాజంలో ఒంట‌రిగా జీవించాల‌ని భావించే వారు పెరుగుతున్నారు. న్యూక్లియ‌ర్ ఫ్యామిలీ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒంటరి జీవితాల‌కు ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డుతున్నారు. భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ ఉద్యోగులు అయితే.. వారి తల్లిదండ్రుల‌ను ద‌గ్గ‌ర ఉండి చూసుకునే కంటే.. కూడా.. ఆశ్ర‌మాల్లో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రాల్లో ఈ సంస్కృతి పెరుగుతున్నట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దీంతో 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వ‌య‌సున్న వృద్ధులు.. ఒంట‌రిగా మిగులుతున్నార‌ట‌. వీరిలోనూ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఒంటరి జీవితాలు గ‌డుపుతున్నార‌ని పేర్కొంది.

కీల‌క విష‌యం ఏంటంటే.. అన్ని బాధ్య‌త‌లు తీరిపోయి.. ఒంట‌రిగా మిగిలిపోవ‌డం ఒక ఎత్త‌యితే.. అస‌లు పెళ్ల‌యిన‌.. జంటల్లో కూడా.. ర‌మార‌మి 30 శాతం మంది ఒంట‌రిగా మారుతున్నార‌న్న‌ది స‌ర్వే వెల్ల‌డిస్తున్న ప్ర‌ధాన విషయం. ఎంతో ఆర్భాటంగా జ‌రుగుతున్న‌ వివాహాలు కూడా.. ప‌ట్టుమ‌ని ఆరుమాసాలు కూడా తిర‌గ‌కుండానే విడాకుల వ‌ర‌కు వెళ్లిపోతున్నాయ‌ని.. అనంత‌రం.. దంప‌తులు.. విడివిడిగా ఉండేందుకు.. ఇష్ట‌ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. మ‌రో పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా చేయ‌డం లేద‌ని చెబుతోంది.

కో లివింగ్ పార్ట‌న‌ర్స్‌!

విడాకులు తీసుకుంటున్న జంట‌లు.. మరో పెళ్లికి సిద్ధం కావ‌డం లేదు.. పైగా.. వారితో క‌లిసి జీవించే.. కోలివింగ్ పార్ట‌న‌ర్స్ కోసం.. యాప్‌ను అన్వేషిస్తున్న‌ట్టు స‌ర్వే తెలిపింది. ఖ‌ర్చుతో సంబంధం లేకుండా.. త‌మ‌తో కొన్నాళ్లు క‌లిసి జీవించి.. ఎలాంటి బాధ్య‌త‌లు, బాద‌ర బందీలు లేకుండా కొన‌సాగాల‌న్న ష‌రతుతో ఈ బంధాలు పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డించింది. అయితే.. ఇది కుటుంబ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఈ న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ముందుంద‌ని.. ఒక‌ప్పుడు జంట‌ల‌కు ప్రాధాన్యం ఉండే.. ప‌రిస్థితి ఇప్పుడు ఒంట‌రి అయింద‌ని స‌ర్వే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.