నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచగా, ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు సమాచారం.
ఆక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేయాలని సిజెపి ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు నీట్ లీక్ ఇష్యూ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనలపై జేపీ నడ్డా స్పందించాల్సి ఉంది.
ఈ రాజకీయ పరిణామాల మధ్యే పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని తన ఆఫీస్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనే విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే బయట నిరసనలు ఉధృతమవడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు పార్లమెంట్ వెలుపల ఆందోళనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఆందోళనకు దిగిన పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలోని కొన్ని మెట్రో స్టేషన్ల గేట్లను తాత్కాలికంగా మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates