ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు వేరు.. ఘటనలు వేరు. కానీ రెండు సంఘటనల వెనుక కనిపిస్తున్న ప్రధాన కారణాలు మాత్రం కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, నిరాశ. ఒకే రోజున వెలుగుచూసిన ఈ రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నలుగురి మృతిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా? ప్రమాదమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
అదే సమయంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, తరచూ జరుగుతున్న గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రెండు ఘటనలు వేర్వేరు పరిస్థితుల్లో జరిగినప్పటికీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. కుటుంబాల్లో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, దాంపత్య విభేదాలు చివరకు ప్రాణాలను బలితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ విషాదాల్లో బలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్నేళ్లుగా కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులను కూడా బలిచేయడం ప్రమాదకర ధోరణిగా మారుతోంది. ప్రకాశం, పల్నాడు ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్న విషయం ఒక్కటే.. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఆత్మహత్య కాదు. ఒక క్షణిక నిర్ణయం నాలుగు ప్రాణాలను బలితీస్తుంది.. అనేక కుటుంబాలను జీవితాంతం విషాదంలో ముంచేస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates