భారత క్రికెట్‌ను గొప్ప మలుపు తిప్పి, టీమ్ ఇండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలబెట్టిన ఘనత సౌరభ్ గంగూలీదే. ఆటగాడిగా, కెప్టెన్‌గా గంగూలీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. అందుకే అతడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. ఆట నుంచి నిష్క్రమించాక క్రికెట్ పాలనలోకి అడుగు పెట్టిన గంగూలీ.. చాలా తక్కువ కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాడు.
అంతా బాగా సాగుతున్న సమయంలో గంగూలీ గుండెపోటుకు గురవడం అభిమానులకు పెద్ద షాక్. అదృష్టం కొద్దీ వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్త నాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నట్లు తేల్చడం.. కొన్ని గంటల తర్వాత యాంజియోప్లాస్టీ చేయడంతో గంగూలీకి పెద్ద ముప్పు తప్పినట్లయింది. పూడికలున్నచోట్ల స్టంట్లు వేయాల్సిన అవసరం రావచ్చని చెబుతున్నారు.
ఐతే ఆటలో ఉన్నపుడు, తర్వాత గంగూలీ ఎంతో ఫిట్‌గానే కనిపించాడు. 40వ ఏట వరకు క్రికెట్ ఆడిన సౌరభ్.. ఆ తర్వాత కూడా చాలా చురుగ్గానే కనిపిస్తున్నాడు. చాలామంది ఆట నుంచి వైదొలిగాక ఫిట్నెస్ గురించి పట్టించుకోరు. కానీ గంగూలీ అలా కాదు.. ఇప్పటికీ చాలా ఫిట్‌గా, హుషారుగా కనిపిస్తాడు. అతను మంచి లైఫ్ స్టైల్‌నే ఫాలో అవుతుంటాడు. మెంటల్‌గా కూడా గంగూలీ చాలా స్ట్రాంగ్. మరి ఇలాంటి వ్యక్తికి గుండెపోటు ఎందుకొచ్చిందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే దీనికి కారణంగా ఫ్యామిలీ హిస్టరీ అని తెలిసింది. గంగూలీ కుటుంబంలో ఇంతకుముందూ గుండె జబ్బు బాధితులున్నారట. అతడి సోదరుడు కూడా ఇంతకుముందు గుండెపోటుకు గురయ్యాడు. సౌరభ్ తండ్రి చండీదాస్ ఏడేళ్ల కిందట గుండెపోటుతోనే మరణించాడు. ఫ్యామిలీ హిస్టరీ ఇలా ఉన్న నేపథ్యంలోనే ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ సౌరభ్ గుండె పోటుకు గురయ్యాడన్నది స్పష్టం. కాబట్టి ఇకపై అతను జాగ్రత్తగా ఉండాల్సిందే.