అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇమ్మిగ్రేషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. జెండాను చింపుతున్న వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆపకపోగా, చప్పట్లు కొడుతూ ఇండియాకు వ్యతిరేకంగా అసభ్యపదజాలంతో నినాదాలు చేయడం ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. నార్త్ డల్లాస్ ప్రాంతంలో భారతీయుల జనాభా పెరుగుతోందనే అక్కసుతోనే ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

గత పదేళ్లలో ఫ్రిస్కో లాంటి నగరాల్లో భారతీయ నిపుణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాల్లో హెచ్ 1బీ వీసాల ద్వారా ఎంతోమంది భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలు, అవకాశాలు వలస వచ్చిన వాళ్లు లాగేసుకుంటున్నారనే ఆందోళన కొంతకాలంగా అక్కడి ప్రజల్లో పెరుగుతోంది. ఆ అసహనమే ఇప్పుడు జాతీయ జెండాను అవమానించే స్థాయికి చేరుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రాగానే నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక జెండాను అవమానించినంత మాత్రాన దేశం స్థాయి తగ్గిపోదని, అది చింపిన వాళ్ల దరిద్రపు బుద్ధిని మాత్రమే చూపిస్తుందని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యల వల్ల విధానపరమైన సమస్యలు పరిష్కారం కావని, అర్థవంతమైన చర్చలు జరపాలని పలువురు హితవు పలుకుతున్నారు. ద్వేషం చిమ్మే ఇలాంటి ఘటనలకు భారతీయులు ఏమాత్రం భయపడరని, తాము చేసే పని చేసుకుంటూ పోతామని స్పష్టం చేస్తున్నారు.

జెండా చించివేతపై భారతీయులు కూడా లాజికల్ గా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అమెరికాలో భారతీయులు ఎవరు కూడా ఉచితంగా బతకడం లేదని, కష్టపడి పని చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఉన్నతమైన చదువులు, నైపుణ్యాలు ఉండబట్టే అమెరికన్ కంపెనీలు భారతీయులకు లీగల్ గా ఉద్యోగాలు ఇస్తున్నాయని చెబుతున్నారు. ఒకవేళ వలసవాదులు రావడం స్థానికులకు ఇష్టం లేకపోతే, అమెరికా ప్రభుత్వం వీసాలు, వర్క్ పర్మిట్లు ఎందుకు ఇస్తోందని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ నిపుణుల పాత్ర చాలా కీలకం. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు కూడా పలుమార్లు అంగీకరించాయి. కానీ కొందరు స్థానికులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి చవకబారు పనులకు పాల్పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి విద్వేషపూరిత ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ఎన్నారైలు కోరుతున్నారు.