సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన ఈ భూకంపం కారణంగా ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం కారణంగా పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలేమీ సంభవించకున్నా…7.4 తీవ్రతతో భూమి కంపించడం జపాన్ వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాకుండా ఈ భూకంపం నేపథ్యంలో సముద్రపు అలలు ఏకంగా 10 అడుగుల మేర ఎగిరిపడే ప్రమాదం ఉందంటూ ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భూకంపం తర్వాత పరిస్థితులను సమీక్షించిన జపాన్ అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యల కింద ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తు మేర ఎగిరిపడే ప్రమాదం ఉందని, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎత్తైన ప్రదేశాలే మంచిదని వెల్లడించింది. ఈ సూచనలు సునామీ హెచ్చరికల కిందకే వస్తాయని చెప్పాలి. 10 అడుగుల మేర అలలు ఎగసిపడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. భారీ నష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇక భూకంపం ఉత్తర జపాన్ లో సంభవించగా… దాని కేంద్రం జపాన్ రాజధాని టోక్యోకు వందల మైళ్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూకంప తీవ్రత 7.4గా నమోదు అయ్యిందని జపాన్ అధికారికంగా ప్రకటించగా… ఆ తీవ్రత  7.5గా ఉందని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. ఇక భూకంపం జపాన్ ఉత్తర తీరంలో సంభవించగా.. సునామీ ప్రభావం ఆ దేశ ఈశాన్య తీరంలో ఉండనున్నట్లుగా సమాచారం. మొత్తంగా సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు.