ఘోరం… ఊహించని విధంగా కారుపై పడిన ట్యాంకర్

పై ఫొటో ఎంత దారుణంగా ఉందో చూశారుగా!. రోడ్డు ప్ర‌మాదాల‌కే ఇది ప‌రాకాష్ట అని అధికారులు తెలిపారు. త‌మ ప్ర‌మేయం లేక‌పోయినా.. తాము అప్ర‌మ‌త్తంగానే ఉన్నామ‌ని భావించినా.. ఓ కుటుంబం మొత్తం ఈ ప్ర‌మాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది!. రోడ్డు ప్ర‌మాదాలు స‌హ‌జమే అయినా.. ఇది వాట‌న్నింటికీ ప‌రాకాష్ట‌గా మారింది. ఏమాత్రం సంబంధం లేక‌పోయి నా.. ఓ కారులో ప్ర‌యాణిస్తున్న కుటుంబంలోని న‌లుగురు వ్య‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. కారులోనే నుజ్జునుజ్జ‌య్యారు. వీరిని ర‌క్షించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌య్యాయి.

ఏం జ‌రిగింది?

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ ప‌క్క‌నే స‌మాంత‌రంగా వ‌స్తున్న ఒక కారుపై బోల్తా పడింది. ఇంకేముంది.. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

కారులో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రయాణికులు ఉన్నారని అధికారులు గుర్తించారు.  సమాచారం అందుకున్న టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. కారుపై భారీ ట్యాంక‌రు ప‌డ‌డంతో అది సాధ్యం కాలేదు.

అంద‌రూ తెలంగాణ వారే..

తెలంగాణ రిజిస్ట్రేష‌న్‌తో ఉన్న ఖ‌రీదైన కారులో ప్ర‌యాణిస్తున్న కుటుంబ స‌భ్యులు.. విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ట్యాంక‌ర్‌కు స‌మాంత‌రంగా జాతీయ ర‌హ‌దారిపై కారులో వ‌స్తున్నారు. స‌హ‌జంగా ర‌హ‌దారుల‌పై స‌మాంత‌రంగా ముందుకు సాగ‌డం తెలిసిందే. అయితే.. తాజా ఘ‌ట‌న ఇలా స‌మాంత‌రంగా ప్ర‌యాణిచడం వ‌ల్లే జ‌రిగింది. లారీ బ్రేకులు అకస్మాత్తుగా విఫ‌లం కావ‌డంతో ఒక్క‌సారిగా ఒరిగిపోయి.. ప‌క్క‌గా వ‌స్తున్న కారుపై ప‌డిపోయింది. అంతే.. సుమారు 2 వేల ట‌న్నుల బ‌రువున్న ట్యాంక‌ర్ కారుపై ప‌డేస‌రికి.. కారు పూర్తిగా అణిగిపోయింది.

జాగ్ర‌త్తే ముఖ్యం

జాతీయ ర‌హ‌దారుల‌పై ట్యాంకులు, హెవీ వెహిక‌ల్స్ ప్ర‌యాణిస్తుంటాయి. వాటిని దాటే ప్ర‌య‌త్నంలో కుడి, ఎడ‌మ ప‌క్క‌ల కూడా  బైక‌ర్లు, కార్లు.. ప్ర‌యాణిస్తుంటాయి. ఇలా చేయ‌డం త‌ప్ప‌ని ర‌వాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగిన ప్ర‌మా దంలో కారు.. స‌ద‌రు లారీని ఎడ‌మ ప‌క్క‌గా ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే కారు ప్ర‌మాదంలో చిక్కుకుంది. ఇలాంటి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. హెవీ వెహిక‌ల్స్ ప‌క్క‌గా ప్ర‌యాణించేప్పుడు… జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు చెబుతున్నారు.