ఒక్క పరుగుతో ‘థ్రిల్లింగ్’ విక్టరీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో అసలైన మజాను పంచిన మ్యాచ్‌గా గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు నిలిచిపోతుందని చెప్పవచ్చు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో గుజరాత్ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌ వరకు ఢిల్లీ విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, నిర్ణీత సమయంలో ప్రసీద్ కృష్ణ వేసిన బంతులు, కీపర్ జోస్ బట్లర్ చూపిన సమయస్ఫూర్తి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 209 పరుగుల వద్ద ఆగిపోవడం అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేసింది.

చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, బంతి ప్రసీద్ కృష్ణ చేతిలో ఉంది. క్రీజులో విప్రజ్ నిగమ్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ ఎటు వైపు తిరుగుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. విప్రజ్ ఫోర్ కొట్టి ఆశలు రేపినప్పటికీ, ఆ తర్వాతి బంతికే అవుట్ అవ్వడం ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టింది. ఇక క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదడంతో ఢిల్లీ విజయం ఖాయమనిపించింది. కానీ, ఐదో బంతికి పరుగు తీయకుండా మిల్లర్ చేసిన చిన్న పొరపాటు గుజరాత్‌కు వరంగా మారింది.

ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో ప్రసీద్ కృష్ణ ఎంతో తెలివిగా బౌన్సర్ సంధించాడు. ఆ బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోవడంతో నేరుగా కీపర్ బట్లర్ చేతికి వెళ్ళింది. ఇక్కడే బట్లర్ తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. అప్పటికే ఒక గ్లౌస్ తీసేసి సిద్ధంగా ఉన్న బట్లర్, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రన్ కోసం పరిగెత్తుకొస్తున్న కులదీప్ యాదవ్‌ను గమనించాడు. బంతిని అందుకున్న వెంటనే మెరుపు వేగంతో వికెట్ల వైపు డైరెక్ట్ త్రో విసిరాడు. కులదీప్ డైవ్ చేసినా లాభం లేకపోయింది, నేరుగా వికెట్లు ఎగిరిపోవడంతో గుజరాత్ సంబరాలు మొదలయ్యాయి.

అంతకుముందు గుజరాత్ బ్యాటింగ్ విషయానికి వస్తే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) మెరుపు హాఫ్ సెంచరీలతో ఆ జట్టు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ తరపున కెప్టెన్ కేఎల్ రాహుల్ 92 పరుగులతో వీరోచిత పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో నితీష్ రాణా, సమీర్ రిజ్వీ వంటి వారు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడం ఢిల్లీకి గట్టి దెబ్బ తగిలింది. రషీద్ ఖాన్ 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ కొట్టాడు. మొత్తానికి ఈ మ్యాచ్ పక్కాగా ఐపీఎల్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. అలాగే గుజరాత్ కి మొదటి విజయం దక్కింది.