ఇరాన్‌పై యుద్ధం: మొద‌లు-మ‌లుపులు ఇవే!

ఫిబ్ర‌వ‌రి 28: ప్ర‌పంచం నిద్ర‌లేచి క‌ళ్లు న‌లుముకుంటున్న స‌మ‌యం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒక‌టే బ్రేకింగ్ న్యూస్‌. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడులు అంటూ హోరెత్తిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ స‌హా.. ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్లు మ‌ర‌ణించార‌ని వార్త‌లు వెల్లు వెత్తాయి. ఆ త‌ర్వాత‌.. అది దాడికాదు.. యుద్ధం అంటూ.. తొలుత ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహ్యూ.. త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇలా.. ప్రారంభ‌మైన యుద్ధంలో అనేక మ‌లుపులు.. అనేక వివాదాలు.. అనేక ఒత్తిళ్ల‌తోపాటు.. బ్ర‌తిమాలుకోవ‌డాలు.. బుజ్జ‌గించుకోవ‌డాలు.. కూడా క‌నిపించాయి!.

అస‌లెందుకీ యుద్ధం..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త యుద్ధానికి ఎవ‌రికి కార‌ణం వారికి ఉంది. అందుకే ఇరు దేశాల ప్ర‌యోజ‌నం కోసం.. ఇరాన్‌ను ఉమ్మ‌డి శ‌త్రువును చేసుకున్నారు. అమెరికా ప్ర‌ధానంగా యురేనియం, చ‌మురు నిక్షేపాలు.. హోర్ముజ్ జ‌ల‌సంధిపై ఆధిప‌త్యం కోసం ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. ఇక‌, ఇజ్రాయెల్‌.. త‌న‌కు ఎప్ప‌టికైనా ఇరాన్ ఇబ్బందిక‌ర దేశ‌మ‌ని.. త‌మ పౌరుల‌ను, భూభాగాన్ని కూడా ఆక్ర‌మించుకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోంది. అయితే.. అదేమీ లేద‌ని ఇరాన్ చెప్పింది.

ఈ క్ర‌మంలో ఇజ్రాయెల్‌-అమెరికాలు త‌మ మ‌న‌సులోని ల‌క్ష్యాల‌ను ప‌క్క‌న పెట్టి.. ప్ర‌పంచ దేశాల క‌ళ్ల‌కు `అణుబూచి` అనే గంత‌లు క‌ట్టాయి. ఇరాన్ భారీ ఎత్తున అణ్వాయుధాలు పోగేసుకుంటోంద‌ని.. ఇది ప్ర‌పంచానికి ఇబ్బంద‌ని.. ప్ర‌పంచ శాంతి కోసం ప‌రిప‌రి త‌పిస్తున్న తాను.. ఈ క్ర‌తువును అడ్డుకోక‌పోతే.. విశ్వమానవ క‌ల్యాణానికి విఘాతం క‌లుగుతుంద‌ని పేర్కొంటూ ట్రంప్‌.. చేసిన ప్ర‌క‌ట‌న‌లు తెలిసిందే. ఇక‌, ఇదే వాద‌న‌ను ఇజ్రాయెల్ కూడా అందుకుంది. అక్క‌డే యుద్ధానికి బీజాలు ప‌డ్డాయి.

కానీ.. వాస్త‌వం ఏంటి?

అణు ఆయుధాల త‌యారీ లేనేలేద‌ని.. యురేనియంను శుద్ధి చేయ‌డం త‌ప్పుకాద‌ని ఇరాన్ చెప్పింది. దీనిని ప్ర‌పంచ అణ్వ‌స్త్ర నియంత్ర‌ణ బృందాలు కూడా స‌మ‌ర్థించాయి. అయినా.. ట్రంప్ అంగీక‌రించ లేదు. అంతు చూస్తామంటూ.. యుద్ధానికి దిగారు. ఈ క్ర‌మంలో తొలి ల‌క్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీని ఎంచుకున్నారు. ఆయ‌న‌వ‌ల్లే `ఇదంతా` జరుగుతోంద‌ని.. ఆయ‌న‌ను లేపేస్తామ‌ని ప్ర‌క‌టించి.. అన్నంత ప‌నీచేశారు. ఆ త‌ర్వాత‌.. ఇరాన్ త‌మ‌కు లొంగుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఇక్క‌డే ఇరాన్ త‌న స‌త్తాను చాటుకుంది. ప‌డిలేచిన కెర‌టంలా అమెరికా స‌హా ఇజ్రాయెల్‌తోపాటు.. ఇరాన్ వ్యూహానికి ప్ర‌పంచ దేశాలు విల‌విల్లాడాయి.

ఇంధ‌నం-గ్యాస్‌పై..

ప్ర‌పంచ దేశాల‌కు కారుచౌక‌గా ఇంధ‌నం ల‌భించేది.. గ‌ల్ఫ్ దేశాల నుంచే. దీనిని ఇరాన్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిపై ప‌ట్టుబిగించేస‌రికి.. బ‌ల‌యుతుడైన భీముడికి సైతం ముక్కుమూస్తే ఏం జ‌రుగుతుందో ప్ర‌పంచ దేశాల‌కు కూడా అదే జ‌రిగింది. దీంతో అమెరికాలోనూ సెగ‌లు.. పొగ‌లు వ‌చ్చాయి. ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. ట్రంప్‌ను వినాశ‌క‌ర అధ్య‌క్షుడిగా పేర్కొంటూ.. నిర‌స‌న తెలిపారు. మ‌రోవైపు భారీ ఆయుధాల‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చిన్న‌పాటి ఆయుధాల‌తో ఇరాన్ వాటికి బ‌దులిచ్చింది. దీంతో కేవ‌లం 48 గంట‌ల్లో పూర్త‌వుతుంద‌ని భావించిన యుద్ధం.. 48 రోజుల వ‌ర‌కు సాగింది.(ఏప్రిల్ 8కి 48 రోజులు పూర్తి).

క‌డ‌కు..

ఇరాన్‌ను తుడిచి పెట్టేసే ప‌రిస్థితి లేద‌ని తెలిసిన అమెరికా.. అణ్వాయుధాన్ని ప్ర‌యోగించాల‌ని భావించింది. కానీ, ఇదే జ‌రిగితే.. గ‌తంలో జ‌పాన్‌లో జ‌రిపిన అణ్వాయుధ దాడి మాదిరిగానే ఉంటుంది. అప్ప‌టి సంగ‌తి వేరు. కానీ, ఇప్పుడు ప్ర‌పంచ దేశాల ముందు ట్రంప్ దోషిగా నిల‌బ‌డాలి.. అమెరికా బోనెక్కాలి. అందుకే.. బెదిరింపులు-హెచ్చ‌రిక‌ల‌కే ప‌రిమిత‌మై.. చివ‌రాఖ‌రుకు.. పాకిస్థాన్ ప్ర‌మేయంతో గ‌తంలో ఒక సారి.. ఇప్పుడు మ‌రోసారి తాత్కాలిక ఒప్పందాలు చేసుకుని యుద్ధ విరామానికి నాంది ప‌లికారు.

లేనిపోని డిమాండ్‌!

వాస్త‌వానికి యుద్ధం ప్రారంభానికి ముందు.. ఇరాన్ చ‌ర్చ‌ల‌కు వ‌చ్చింది. దీనికి అమెరికా కూడా ఓకే అంది. ఫ‌లితంగా ఇరాన్‌లో అణ్వాయుధాలు లేవ‌ని ఆ దేశం నిరూపించేందుకు రెడీ అయింది. కానీ, ఇంత‌లోనే దాడులు ప్రారంభ‌మ‌య్యాయి. అప్ప‌టి వ‌ర‌కు పైచేయిగా ఉన్న అమెరికా.. ఆ త‌ర్వాత‌.. ఇరాన్ బీభ‌త్సానికి వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. దీంతో గ‌త డిమాండ్లు అన్నీ వెన‌క్కి పోయి.. ఇప్పుడు త‌మ నౌక‌లు వ‌చ్చేందుకు.. హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరిస్తే చాలు.. అన్న‌ట్టుగా అమెరికా డిమాండ్ మారిపోయింది. సో.. విధి ఎంత బ‌లీయ‌మైందో చెప్ప‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌.!!. ప్ర‌స్తుతం యుద్ధానికి విరామం ఇవ్వ‌డం. ప్ర‌పంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ రెండు వారాల్లో జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించిన‌ట్టు అమెరికా చెబుతోంది.