ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 5న గురువారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ నంబర్ 1, నంబర్ 2 జట్ల మధ్య జరిగే ఈ పోరులో గెలిచిన జట్టు.. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ లేదా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ప్రస్తుత టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో భీకరమైన ఫామ్‌లో ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్ మూడు సార్లు విజయం సాధించగా, ఇంగ్లాండ్ రెండు సార్లు గెలిచింది. 2007లో కింగ్స్‌మీడ్‌లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగులే భారత్‌కు అత్యధిక స్కోరు. అలాగే 2012లో కొలంబోలో ఇంగ్లాండ్‌ను కేవలం 80 పరుగులకే ఆలౌట్ చేసి 90 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 2022 సెమీఫైనల్‌లో ఎదురైన 10 వికెట్ల ఓటమి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
వ్యక్తిగత రికార్డుల్లో మాజీ ఆటగాళ్ల రికార్డులు మరువలేనివి. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 148 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. యువరాజ్ సింగ్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 75 పరుగులు చేసినప్పటికీ, 300 స్ట్రైక్ రేట్‌తో ఇంగ్లాండ్ బౌలర్లను వణికించారు. ముఖ్యంగా 2007లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది యువరాజ్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులకు గుర్తే. బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అతని బెస్ట్ స్పెల్.
గత వరల్డ్ కప్ (2024) సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈసారి వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ భారత్‌కు కలిసి వచ్చే అంశం. ప్రస్తుత జట్టులో ఈశాన్ కిషన్, సంజూ వంటి వారు ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే విషయం. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ప్రమాదకరంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇంగ్లీష్ మిడిల్ ఆర్డర్ ను కట్టడి చేయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఫ్యాన్స్ అందరూ ఈ మెగా ఫైట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో వాతావరణం కూడా క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వాంఖడేలో భారత్ మరో మెగా మ్యాచ్ ఆడుతుండటం విశేషం. పాత రికార్డులు ఎలా ఉన్నా, ఆ రోజు గ్రౌండ్‌లో ఎవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారో వారే ఫైనల్‌కు చేరుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates