`ఒత్తిడి` కేవ‌లం మాట కాదు.. ప్రాణాల‌పైకే తెస్తోంది!

Shot of a young businessman experiencing stress during a late night at work

డిప్రెష‌న్‌-ఒత్తిడి.. ఇది కేవ‌లం మాట కాదు. ప్రాణాల‌నే హ‌రిస్తోంది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయినా.. కొంద‌రు ప్రాణాలు తీసుకునే ప‌రిస్థితిని తెచ్చుకుంటున్నారు. తాజాగా చ‌ర్ల‌ప‌ల్లిలో జ‌రిగిన టెక్ ఉద్యోగి విజ‌య‌శాంతి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి చేసుకున్న ఆత్మ‌హ‌త్య వెనుక ఒత్తిడే కార‌ణ‌మ‌ని పోలీసులు తేల్చారు.

గ‌త 9 రోజుల కింద‌ట చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘోరం జ‌రిగింది. చేతినిండా డ‌బ్బుంది. విలాస వంత‌మైన జీవితం కూడా ఉంది. ఎదిగివ‌చ్చిన పిల్ల‌లు.. ఉన్నారు. చ‌క్క‌గా చ‌దువుకుంటున్నారు. కానీ, ఒత్తిడి ఈ కుటుంబాన్ని మింగేసింది. విజ‌య‌శాంతిలో మొద‌లైన ఒత్తిడి ప్ర‌భావం.. ఒక కుటుంబాన్ని అతలాకుత‌లం చేసింది. మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఆమె భ‌ర్త ఒంట‌రి వాడ‌య్యారు.

ఇది విజ‌య‌శాంతి క‌థే కాదు.. అనేక మంది విద్యార్థులు సైతం ఇదే బాట ప‌డుతున్నారు. ఇక‌, టెక్ కంపెనీల్లో ప‌నిచేస్తున్న‌వారు కూడా ఆత్మ‌హ‌త్య‌ల బాట‌ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒత్తిడేన‌ని నిపుణులు గ‌త కొంత‌కాలంగా చెబుతున్నారు. దీనిని అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని కూడా సూచిస్తున్నారు.

సాధార‌ణ జీవితాల్లో గ‌త కొంత‌కాలంగా అసాధార‌ణ లక్ష్యాలు వ‌చ్చి చేరాయి. పొరుగు వారిని ఊహించుకుని.. వారితో పోల్చుకుని సంపాయించేందుకు ప‌రుగులు పెడుతున్న నేప‌థ్యంలో ఒత్తిడి మ‌న‌పై దాడి చేస్తోంద‌ని అంటున్నారు.

దీనిని అధిగ‌మించేందుకు ప్రాణాయామం, యోగా వంటివి ఇంట్లోనే చేయొచ్చు. కుటుంబంతో క‌లిసి ఆనందంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. ఎంత ఒత్తిడి వ‌చ్చినా.. స్నేహితుల‌తో ఆ విష‌యాల‌ను పంచుకుంటే కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం పొందే అవ‌కాశం ఉంటుంది.

విజ‌య‌శాంతి విష‌యంలో ఈ లోపం క‌నిపిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఆమె గుంభ‌నంగా ఉంటూ.. త‌న‌లో త‌నే ఆవేద‌న‌ను అనుభ‌వించ‌డం ఒత్తిడి ని మరింత పెంచింది.

దీనికితోడు భ‌ర్త‌తో స‌ఖ్య‌త ఉన్నా.. దూరంగా దుబాయ్‌లో ఉన్న కార‌ణం కూడా ఆమెను వేధించింద‌ని తెలుస్తోంది. సో.. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాల‌ను అనుస‌రించ‌డం ద్వారా.. దీనిపై పైచేయి సాధించ‌వ‌చ్చ‌ని,.. అమూల్య‌మైన జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.