ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయగా, వేలాది వాహనాలు రోడ్డుపైనే ఇరుక్కుపోయాయి. దాదాపు 30 గంటలకు పైగా జనం తిండి, నీళ్లు లేక నడిరోడ్డుపై నరకం చూశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈ ట్రాఫిక్ నరకంలో పుణె పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా కూడా చిక్కుకున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కారులోనే ఉండిపోయిన ఆయనకు సహనం నశించింది. తన పనులు ఆగిపోతుండటంతో చేసేదేం లేక హెలికాప్టర్ బుక్ చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డారు. గాల్లో ప్రయాణిస్తూ కింద ఉన్న ట్రాఫిక్ జామ్‌ను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్‌గా మారింది.

హెలికాప్టర్‌లో వెళ్లడం విలాసం కోసం కాదని, అది తన అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క ట్యాంకర్ వల్ల లక్షలాది మంది ప్రజలు ఇన్ని గంటలు ఇబ్బంది పడటం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని మెహతా మండిపడ్డారు. హైవే మధ్యలో వాహనాలు వెనక్కి వెళ్లేందుకు కనీసం ఎగ్జిట్ పాయింట్లు కూడా లేకపోవడం వల్లనే ఈ రద్దీ ఇంత దారుణంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి కొన్ని ప్రాక్టికల్ సూచనలు కూడా చేశారు. హైవే పొడవునా అక్కడక్కడా హెలిప్యాడ్‌లు నిర్మించడం తప్పనిసరి చేయాలని కోరారు.

ఒక ఎకరం కంటే తక్కువ స్థలంలో పది లక్షల లోపు ఖర్చుతోనే వీటిని కట్టవచ్చని వివరించారు. అత్యవసర సమయంలో ప్రజలను తరలించడానికి లేదా సహాయక చర్యలు చేపట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఇక 33 గంటల తర్వాత ఆ గ్యాస్ ట్యాంకర్‌ను తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.

సుధీర్ మెహతా హెలికాప్టర్ ప్రయాణం సౌకర్యవంతంగానే ఉన్నా, సామాన్య ప్రయాణికులు పడ్డ కష్టాలు మాత్రం ఎవరూ తీర్చలేనివి. రోడ్లు ఎంత ఆధునికంగా ఉన్నా, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే తీరులో మార్పు రాకపోతే ఇలాంటి తిప్పలు తప్పవని జనాలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.