ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల ఫేమ్‌నే పెట్టుబడిగా తీసుకుని, తాము డబ్బులు పెట్టి వరుసగా హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌లు కడుతోంది ఆ సంస్థ. ఈ దిశగా తొలి అడుగు పడింది గచ్చిబౌలిలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌తోనే. ఆ తర్వాత ఏఏఏ, ఏవీడీ, ఏఆర్‌టీ.. ఇలా వరుసగా మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. 

మహేష్ బాబుతో కలిసి మొదలుపెట్టిన ఏఎంబీ (గచ్చిబౌలి) స్వల్ప కాలంలోనే టాప్ మల్టీప్లెక్స్‌గా ఎదిగింది. నగరంలో మరే మల్టీప్లెక్స్‌లో లేనంతగా ఆక్యుపెన్సీలు ఉంటాయి సినిమాలకు అక్కడ. సినిమా భాషలో చెప్పాలంటే గచ్చిబౌలి ఏఎంబీని బ్లాక్‌బస్టర్ అని చెప్పొచ్చు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే ఇంకో ఏఎంబీ నిర్మాణం కూడా జరుగుతోంది. ఐతే అంతకంటే ముందు బెంగళూరులో ఏఎంబీ ఏర్పాటైంది.

బెంగళూరులో మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ, అక్కడ ఏర్పాటైన ఏఎంబీలో స్క్రీన్ల ఆకర్షణ అదీ చూసి అక్కడ కూడా ఈ మల్టీప్లెక్స్ మోత మోగించేస్తుందని అనుకున్నారు. సౌత్ ఇండియాలో తొలి దాల్బీ స్క్రీన్‌తో పాటు ఏఎంబీ లగ్జరీ స్క్రీన్.. ఇలా మొత్తం మొత్తం తొమ్మిది స్క్రీన్లతో ఇక్కడ మల్టీప్లెక్స్ ఏర్పాటైంది. కానీ సంక్రాంతి కానుకగా మొదలైన ఈ మల్టీప్లెక్స్‌‌కు ఆశించిన సక్సెస్ దక్కుతున్నట్లు కనిపించడం లేదు. వేరే మల్టీప్లెక్సులతో పోలిస్తే ఇక్కడ ఆక్యుపెన్సీలు తక్కువగా ఉన్నాయి.

యాంబియెన్స్, లగ్జరీ, టెక్నాలజీ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా బెంగళూరులో ఉన్న బెస్ట్ మల్టీప్లెక్సుల్లో ఇదొకటి. అయినా దీనికి రెస్పాన్స్ తక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆక్యుపెన్సీలు పెంచడం కోసం రోజూ మార్నింగ్ షోలకు వచ్చే జనాలకు ఉచిత సమోసా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారక్కడ. ఐతే ఆక్యుపెన్సీలు తక్కువగా ఉండడానికి రాంగ్ ప్లేస్మెంట్ ఒక ముఖ్య కారణంగా కనిపిస్తోంది. 

ఇది మెజెస్టిక్ ఏరియాలో ఇంతకుముందున్న కపాలి థియేటర్ స్థానంలో ఏర్పాటైన మల్టీప్లెక్స్. ఐతే ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులు ఇక్కడ పెద్దగా నివాసముండరు. గచ్చిబౌలిలో ఐటీ ఎంప్లాయిస్ వల్లే ఏఎంబీ సూపర్ హిట్ అయిందన్నది స్పష్టం.

మరోవైపు రాంగ్ టైమింగ్‌లో మల్టీప్లెక్స్‌ను మొదలుపెట్టడం కూడా మైనస్ అయిందనే అభిప్రాయాలున్నాయి. కాంతార లేదా టాక్సిక్ లాంటి పెద్ద కన్నడ సినిమాలు రిలీజైన సమయంలో దీన్ని మొదలుపెట్టాల్సిందని అంటున్నారు. ‘కాంతార’ టైంకి మల్టీప్లెక్స్ రెడీ కాలేదు. మార్చిలో ‘టాక్సిక్’‌తో పాటు ‘దురంధర్-2’ రిలీజైనపుడు ఈ మల్టీప్లెక్స్ పుంజుకుంటుందని భావిస్తున్నారు.