బెంగళూరులో పనిమనుషులుగా చేరిన ఒక నేపాలీ జంట తమ యజమానికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. నమ్మకంగా ఇంట్లో చేరి, కేవలం 20 రోజుల్లోనే పక్కా స్కెచ్‌తో ఏకంగా రూ. 18 కోట్ల విలువైన సొత్తుతో పరారయ్యారు. యలహంక కెంపురా మెయిన్ రోడ్‌లో నివసించే బిల్డర్ శిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ దోపిడీకి దినేశ్, కమల అనే నేపాలీ దంపతులు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.
ఆదివారం ఉదయం యజమాని శిమంత్ తన కుటుంబంతో కలిసి భూమి పూజ కోసం బయటకు వెళ్లిన సమయాన్ని వీరు అనుకూలంగా మార్చుకున్నారు. వారు లేని సమయంలో తమ సహచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి, బీరువాలను ఇనుప రాడ్లతో పగలగొట్టి లోపల ఉన్న విలువైన వస్తువులను ఊడ్చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తు వివరాలు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10 కిలోల బంగారం, వజ్రాభరణాలను దొంగిలించిన నిందితులు, మొదటి అంతస్తులోని లాకర్‌ను కూడా వదల్లేదు. అక్కడ ఉన్న మరో 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి మరియు రూ. 11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
మొత్తం దోపిడీ విలువ దాదాపు రూ. 18 కోట్లు ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని మరో పనిమనిషి ఈ విషయాన్ని గమనించి యజమానికి సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 20 రోజుల క్రితమే పనిలో చేరిన ఈ జంట, యజమాని కుటుంబ సభ్యుల కదలికలను క్షుణ్ణంగా గమనించి ఈ ప్లాన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. మారతహళ్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు లేదా నేపాల్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్త వారిని పనిలో పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు సరిచూసుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. భారీ నగదు, నగలు ఇంట్లో ఉంచుకునే వారు సీసీ కెమెరాలు, అధునాతన సెక్యూరిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం మేలని సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates