ముగిసిన శ్రీవారి `ల‌డ్డూ` విచార‌ణ‌… ఛార్జిషీట్ లో ఏముంది?

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ప్ర‌సాదం.. ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. జంతువుల కొవ్వు స‌హా ఇత‌ర క‌ల్తీ ప‌దార్థాల‌ను వినియోగించి.. ల‌డ్డూల‌ను త‌యారు చేసి.. ఆల‌య ప‌విత్ర‌త‌ను భ‌గ్నం చేశార‌ని సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు సీబీఐతో ప్ర‌త్యేక విచార‌ణ బృందాన్ని(సిట్‌) నియ‌మించింది. ఈ బృందం 15 నెల‌ల పాటు విచారించి.. 12 రాష్ట్రాల్లో న‌కిలీ నెయ్యికి సంబంధించిన వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుంది.

మొత్తంగా 15 మాసాల పాటు సాగిన ఈ విచార‌ణ ఎట్ట‌కేల‌కు ముగిసింది. శుక్ర‌వారం త‌న చార్జిషీట్‌ను నెల్లూరు స్థానిక కోర్టులో సీబీఐ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం దాఖ‌లు చేసింది. దీనిలో 24 మందిని నిందితులుగా పేర్కొన్న‌ట్టు తెలిసింది. ముఖ్యంగా `బోలేబాబా` డెయిరీనే ఈక‌ల్తీకి కార‌ణ‌మ‌ని.. అక్క‌డే అంతా జ‌రిగింద‌ని పేర్కొన్న సిట్‌.. దీనికి సంబంధించిన ఆధారాల‌ను కూడా చార్జిషీట్‌లో వివ‌రించింది.

మొత్తంగా సీబీఐ స‌హా.. భార‌త ఆహార నాణ్య‌త త‌నిఖీ విభాగం అధికారులు మొత్తం 30 మంది ఈ కేసును క్షుణ్ణంగా విచారించారు. అనేక మందిని అరెస్టుచేశారు.

చార్జిషీట్‌లో పేర్కొన్న కీల‌క విష‌యాలు!

+ బోలేబాబా ఆర్గానిక్ డెయిరీలోనే పాలు లేకుండా నెయ్యిని ఉత్ప‌త్తి చేశారు.
+ దీనికి కృత్రిమ ర‌సాయ‌నాలు, పామాయిల్ వంటి వాటిని వినియోగించారు.
+ బోలే బాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ న‌కిలీకి కీలక సూత్రధారులు.
+ ఏపీ స‌హా 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఉంది.
+ మొత్తం ఈ కేసులో 24 మంది నిందితులు ఉన్నారు.
+ టీటీడీ బోర్డు నిర్ణ‌యం మేరకే బోలేబాబాకు నెయ్యి కంట్రాక్టు
+ న‌కిలీ నెయ్యి పంపుతున్నార‌ని తెలిసికూడా రాజీ ప‌డ్డారు.
+ అధికారులు చెప్పినా.. బోర్డు వినిపించుకోలేదు.
+ దీనిలో క్షేత్ర‌స్థాయి సిబ్బంది పాత్ర కూడా ఉంది.
+ క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డి.. న‌కిలీ నెయ్యి నాణ్య‌త‌ను విస్మ‌రించారు.