సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70 ఏళ్ల వయసులో సరదాగా చేసిన మొదటి వ్లాగ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కేవలం 72 గంటల్లోనే ఈ వీడియోకు దాదాపు 3 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఎటువంటి అనుభవం లేకపోయినా, ఆయన చూపించిన నిజాయితీ నెటిజన్ల మనసు గెలుచుకుంది.
రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండకుండా సమయాన్ని సరదాగా గడపడానికి వినోద్ కుమార్ వ్లాగింగ్ మొదలుపెట్టారు. తన మొదటి వీడియోలో “నా పేరు వినోద్ కుమార్ శర్మ, నాకు వ్లాగ్స్ చేయడం రాదు.. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను” అంటూ చాలా వినమ్రంగా పరిచయం చేసుకున్నారు. మీ అందరికీ నా వీడియో నచ్చితే, అదే ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేస్తానని ఆయన కోరారు. ఆయనలోని అమాయకత్వం, స్వచ్ఛమైన మాటలు చూసి జనం ఫిదా అయిపోయారు.
ఈ వీడియోకు వ్యూస్ మాత్రమే కాదు, ఏకంగా 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. “వయసు అనేది కేవలం అంకె మాత్రమే అంకుల్.. మేము మీకు సపోర్ట్ చేస్తాం” అంటూ వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విమర్శలు చప్పట్లుగా మారే వరకు నేను ఆగను అని ఆయన చెప్పిన మాటలు యువతకు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. మొదటి వీడియోతోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ 64 వేల మార్కును దాటేసింది.
కేవలం సామాన్యులే కాదు, అనుపమ్ ఖేర్, జై భానుశాలి వంటి సెలబ్రిటీలు కూడా ఈ ‘సూపర్ గ్రాండ్ పా’ వీడియోను చూసి మురిసిపోయారు. “మీ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ వీడియో చాలా బాగుంది” అని జై భానుశాలి కామెంట్ చేశారు. హై క్వాలిటీ కెమెరాలు, గ్రాఫిక్స్ ఉన్న వీడియోల కంటే మనసు నుంచి వచ్చే నిజాయితీ ఉన్న కంటెంట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుందని ఈ వ్లాగ్ నిరూపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates