ఒకప్పుడు తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించడం కోసం ఏకంగా క్రీడాకారులను స్టేడియం నుంచి బయటకు పంపించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గుర్తున్నారా? అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కొత్త కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
2022లో ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకుంటుండగా, ఈ అధికారి తన కుక్కను వాకింగ్‌కు తీసుకురావడానికి వారిని రాత్రి 7 గంటలకే పంపించేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తమ ప్రాక్టీస్ దెబ్బతింటోందని కోచ్‌లు, క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం మీద తీవ్ర విమర్శలు రావడంతో అప్పటి ఢిల్లీ ప్రభుత్వం అన్ని స్టేడియంలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించింది.
ఈ వివాదం ముదరడంతో కేంద్ర హోం శాఖ వెంటనే స్పందించి సంజీవ్ ఖిర్వార్‌ను లడఖ్‌కు బదిలీ చేసింది. సుమారు మూడేళ్ల శిక్ష తర్వాత ఆయనను తిరిగి దేశ రాజధానిలో కీలకమైన ఎంసీడీ కమిషనర్ బాధ్యతల్లోకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అశ్విని కుమార్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఎంసీడీ ఆర్థిక, పరిపాలనా పరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడుతుండటంతో సంజీవ్ ఖిర్వార్‌కు ఈ పదవి ఒక పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. పాత వివాదాలను పక్కన పెట్టి ఆయన ఎంసీడీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
అయితే, ఒక వివాదాస్పద అధికారికి ఇంత కీలక బాధ్యతలు అప్పగించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిబంధనలు సామాన్యులకేనా అధికారులకు ఉండవా అనే ప్రశ్నలు మళ్ళీ వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates