ఇలా అయితే ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరైనా కొంటారా?

ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైకులు, మోపెడ్‌లు మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ ఓలా వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఈ బైక్‌లను తయారు చేశాయి. కానీ తన బ్రాండ్ ఇమేజ్‌ను ఈ బైకుల విషయంలో ఓలా నిలబెట్టుకోలేకపోయింది.

ఓలా బైకులకు సర్వీస్ బాగోలేదని ఓలా షోరూంల ముందు బైకులు తగులబెట్టి మరీ కస్టమర్లు నిరసన తెలిపిన వైనం గతంలో షాకింగ్‌గా మారింది. ఆ తర్వాత ఈ బైక్‌లో లోపాలను సరిచేశామని ఓలా చెబుతున్నప్పటికీ పరిస్థితి ఏమీ మారినట్లు లేదు. తాజాగా పుణెలో ఓలా స్కూటర్ నుంచి మంటలు రావడం షాకింగ్‌గా మారింది. వెంటనే అప్రమత్తమైన ఆ స్కూటర్ నుంచి ఆ వాహనదారుడు, ఆయన కొడుకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పుణెలోని సోలాపూర్ స్కూల్‌లో చదువుతున్న తన కొడుకును పిక్ చేసుకునేందుకు తండ్రి స్కూల్‌కు ఓలా బైక్‌పై వచ్చాడు. ఆ పిల్లాడు బైక్ ఎక్కిన వెంటనే ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. అటుగా వెళ్తున్నవారు గమనించి అతడికి చెప్పారు. వెంటనే తన కొడుకును పక్కకు నెట్టేసిన ఆ తండ్రి ఆ తర్వాత బైక్ దిగి దూరంగా వెళ్లాడు. లక్కీగా ఆ పిల్లాడు, తండ్రి ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

స్కూల్ పక్కన ఉన్న దుకాణదారులు హుటాహుటిన స్పందించి బైక్‌పై నీళ్లు పోసి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఓలా తీరు మాత్రం మారడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓలా ఇలా అయితే ఎలా? ఎన్నాళ్లిలా? అని ప్రశ్నిస్తున్నారు.