‘చనిపోయిన తర్వాత కూడా వదలవా…’ చిన్మయికి కౌంటర్!

కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణల వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఒక పోస్ట్, దానికి నటి కస్తూరి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

డెహ్రాడూన్‌లో ఒక మహిళను వేధించిన వ్యక్తి అరెస్టయిన వార్తను షేర్ చేస్తూ.. ఒకవేళ ఈ వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే, అది ఆ మహిళ తప్పే అవుతుందేమో అంటూ చిన్మయి వెటకారంగా స్పందించారు. 

కేరళ ఘటనలో చనిపోయిన దీపక్ ఉదంతాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ఈ కామెంట్స్ చాలా మందికి ఆగ్రహం తెప్పించాయి. తప్పు చేసిన వాడికి, అన్యాయంగా నింద పడి చనిపోయిన వాడికి మధ్య చిన్మయి చేసిన పోలిక సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్మయి పోస్ట్‌పై సీనియర్ నటి కస్తూరి శంకర్ గట్టిగా రియాక్ట్ అయ్యారు.

చనిపోయిన వ్యక్తిని కూడా వదలకుండా ఇలాంటి హృదయహీనమైన పోస్ట్లు చేయడం బాధగాను, కోపంగాను ఉందన్నారు. అసలు ఈ రెండింటికీ పొంతన లేని పోలిక ఏంటని ఆమె ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడటం అమానుషమని కస్తూరి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఒకరి ప్రపంచంలో మగవాళ్ళంతా రాక్షసులుగాను, ఆడవాళ్ళంతా బాధితులుగాను మాత్రమే కనిపించడం చాలా ఆందోళన కలిగించే విషయమని కస్తూరి చురకలు అంటించారు. ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆలోచింపజేస్తోంది.

కేరళ బస్సు ఘటనలో దీపక్ తప్పు లేదనే వాదనలు ఎక్కువవుతున్నాయి. కావాలని ఆమె వీడియో తీసినట్లు ఉందని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు. నింద నిజమైతే చట్టం శిక్షిస్తుంది, కానీ అబద్ధపు ఆరోపణలతో ప్రాణాలు తీస్తే ఆ పాపం ఎవరిది? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఇక చిన్మయి లాంటి వారు దానిని వేరే యాంగిల్‌లోకి తీసుకెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ఫాలోయింగ్ కోసం లేదా ఫెమినిజం పేరుతో ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ప్రాణాలు తీయడం నేరమనే కామెంట్స్ వస్తున్నాయి. కస్తూరి ఇచ్చిన కౌంటర్ ఈ విషయంలో ఒక బ్యాలెన్స్‌డ్ ఆలోచనను రేకెత్తించిందని మరికొందరు చెబుతున్నారు.