ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద, భూమిపై ఉన్న సగం జనాభా, అంటే సుమారు 400 కోట్ల మంది దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ. ఆక్స్ ఫామ్ (Oxfam) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలను వెల్లడించింది.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఈ అత్యంత ధనికుల సంపద 16.2 శాతం పెరిగి 18.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ అనుసరిస్తున్న కార్పొరేట్ పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి విధానాలు ఈ గ్లోబల్ ఎలైట్ గ్రూప్‌కు బాగా కలిసివచ్చాయని ఆక్స్ ఫామ్ విశ్లేషించింది. ఈ సంపద కేవలం విలాసాలకే పరిమితం కాకుండా, రాజకీయాలను శాసించే శక్తిగా మారుతోందని నివేదిక హెచ్చరించింది.
బిలియనీర్లు తమ సంపదతో మీడియా సంస్థలను కొనుగోలు చేస్తూ రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేస్తున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఎలాన్ మస్క్ ‘X’ ప్లాట్‌ఫామ్‌ను, జెఫ్ బెజోస్ ‘వాషింగ్టన్ పోస్ట్’ను కొనడం దీనికి నిదర్శనమని ఆక్స్ ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ అన్నారు. ఈ ధనిక వర్గానికి సామాన్యులకు మధ్య పెరుగుతున్న ఈ భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ట్రంప్ భారీ బృందంతో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నిరసనలు కూడా మొదలయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవ్వని వ్యక్తులు ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం ఏంటని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ పన్ను ఒప్పందాలను పక్కన పెట్టి మల్టీ నేషనల్ కంపెనీలకు మినహాయింపులు ఇవ్వడం వల్ల అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆక్స్ ఫామ్ విమర్శించింది.
అత్యంత ధనికులు తమ సంపదతో దేశాల ఆర్థిక నియమాలను, పరిపాలనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి ధోరణి వల్ల సామాన్యుల హక్కులు, రాజకీయ స్వేచ్ఛ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఈ నివేదిక ఒక క్లారిటీ ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
