మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే ఫిక్సింగ్ ఆరోపణలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. ఐపీఎల్ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, దాని వెనుక ఉండే సెక్యూరిటీ నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు ఫిక్స్ అవ్వడం అనేది అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.
పార్థివ్ పటేల్ తన కెరీర్‌లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, సీఎస్‌కే వంటి పెద్ద జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న ఆయన, లీగ్ లోపల జరిగే భద్రతా ఏర్పాట్లపై క్లియర్ కట్ ఇన్ఫో ఇచ్చారు. ప్లేయర్స్ వాడే ఫోన్లు, ఈమెయిల్‌లు మాత్రమే కాకుండా, హోటల్ రూమ్‌లో వారు ఎవరిని కలుస్తున్నారు అనే ప్రతి అడుగును బీసీసీఐ నిశితంగా గమనిస్తుందని తెలిపారు.
గ్రౌండ్‌లోకి లేదా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవరైనా వెళ్లాలంటే సరైన గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని పార్థివ్ చెప్పారు. చివరికి టీమ్ కెప్టెన్ అయినా సరే, కార్డు లేకపోతే లోపలికి అనుమతించరని ఆయన వెల్లడించారు. ఆటగాళ్ల కదలికలన్నీ ట్రాకింగ్‌లో ఉంటాయని, ఇంత నిఘా మధ్య ఫిక్సింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన ఫిక్సింగ్ పుకార్లను కొట్టిపారేశారు.
బయట ఉండే వ్యక్తులకు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని చెప్పడం చాలా సులభం కానీ, వాస్తవానికి ఒక మ్యాచ్ గెలవడం వెనుక ఆటగాళ్ల శ్రమ ప్రతిష్ట ఉంటుందని పార్థివ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా ఫిక్సింగ్ అనేది కేవలం మాటల్లోనే వినిపిస్తుందని, పక్కా ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఐపీఎల్ చరిత్రలో 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఘటనను ఆయన గుర్తు చేశారు.
అప్పట్లో శ్రీశాంత్ వంటి ఆటగాళ్ల అరెస్ట్, చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం వంటి చేదు అనుభవాల తర్వాత సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారని చెప్పారు. ఆ సంఘటనల తర్వాత ఐసీసీ బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ACU) నిరంతరం నిఘా ఉంచుతూ ఆటను స్వచ్ఛంగా ఉంచుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జరగబోయే 19వ సీజన్ లో కూడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
