అతిగా బీర్లు తాగడం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పోటీపడి అతిగా మద్యం సేవించడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన కంభంవారిపల్లి మండలం కే.వీ.పల్లి పరిధిలోని బండవడ్డిపల్లిలో చోటుచేసుకుంది. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు.
పార్టీ సమయంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పోటీపడి మొత్తం 19 బీర్లు తాగినట్లు అధికారులు వెల్లడించారు. అధికంగా మద్యం సేవించడంతో వారు డీహైడ్రేషన్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యంలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనను నకిలీ మద్యం తాగి చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అదే పార్టీకి హాజరైన ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) తక్కువగా మద్యం సేవించడంతో వారు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి నిర్ధారణ కోసం వారు తాగిన బీరు శాంపుళ్లను చిత్తూరుకు పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
