కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన సెక్స్‌టార్షన్ కేసులో లలిత మరియు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ దంపతులు పెద్ద ఎత్తున బ్లాక్‌మేయిల్ దందా నడిపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
లలిత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పురుషులను పరిచయం చేసుకుని నమ్మకం కలిగించేది. ఆ తర్వాత వారిని వ్యక్తిగతంగా కలుసుకుని సన్నిహితంగా వ్యవహరించేది. ఈ సమయంలో ఆమె భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడని పోలీసులు తెలిపారు. తరువాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
పోలీసుల సమాచారం ప్రకారం దాదాపు 1500 మంది పురుషులు ఈ రాకెట్‌లో చిక్కుకున్నట్లు అనుమానం ఉంది. లలిత సుమారు 100 మందితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. ఈ వీడియోల ఆధారంగా బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
లలిత భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపార నష్టాలు, అప్పులు, ఈఎంఐల భారం పెరగడంతో డబ్బుల కోసం ఈ దారిని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపినట్టు కూడా గుర్తించారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి కారణం ఒక లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు. ఇప్పటికే అతడినుంచి 13 లక్షలు వసూలు చేసిన దంపతులు, మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని, ప్రాణహాని చేస్తామని కూడా హెచ్చరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి మూడు సంవత్సరాల క్రితమే పెళ్లి కాగా, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి, ఇతర బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates